Romantic Drama OTT : ప్రేమలో పడటానికి కులం, కుటుంబం, సమాజం అనుమతి అవసరం లేదనుకునే ఏ జంట. కానీ ఇదంతా నచ్చని కుటుంబాలు పాత ఆచారాలు, పరువు పేరుతో చెలరేగే హింస వాళ్ను డేంజర్ లో పడేస్తే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో చూపించే సినిమానే ‘Saale Aashiq’. ప్రేమకథలా మొదలై క్రమంగా హానర్ పేరుతో జరిగే దారుణాల వైపు తీసుకెళ్లే ఈ హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ హిందీ సినిమా తెలుగులో ఉందా ? స్ట్రీమింగ్ ఎక్కడ ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
మధ్యప్రదేశ్ లోని ఓ చిన్న పట్టణం నేపథ్యంలో కథ సాగుతుంది. శత్రు, గుడియా ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు. ఒకరినొకరు ఇష్టపడటం మొదలైన తర్వాత ఆ ప్రేమ క్రమంగా బలమైన బంధంగా మారుతుంది. వాళ్లకు మాత్రం తమ మధ్య ఉన్న ప్రేమే ముఖ్యం. కానీ చుట్టూ ఉన్న సమాజానికి మాత్రం కులం, కుటుంబ పరువు, పాత సంప్రదాయాలే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి.
శత్రు, గుడియా తమ కుటుంబాలకు విషయం చెప్పిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. రెండు కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు, వాళ్ల ప్రేమను ఆపేందుకు సామాజిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మొదట మాటలతో మొదలైన వ్యతిరేకత క్రమంగా బెదిరింపుల స్థాయికి చేరుతుంది. ప్రేమించిన వ్యక్తిని వదిలేస్తే సమస్య ముగిసిపోతుందని పెద్దలు చెప్పినా, ఇద్దరూ తమ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉండరు.
ఇక ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. కుటుంబ గౌరవం పేరుతో యువత జీవితాలపై నిర్ణయాలు తీసుకునే విధానం, కులం పేరుతో ఏర్పడే విభేదాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పరిస్థితులను ఉపయోగించుకునే వ్యక్తులు కథను కీలక మలుపు తిప్పుతాయి. శత్రు, గుడియాల సంబంధం చుట్టూ ఉద్రిక్తత పెరుగుతున్న కొద్దీ వాళ్లకు ఎదురయ్యే ప్రమాదం కూడా ఎక్కువవుతుంది.
ఒకవైపు తమ ప్రేమను కాపాడుకోవాలని ప్రయత్నించే శత్రు, గుడియా.. మరోవైపు వాళ్లను విడదీయడానికి కుటుంబాలు… చివరికి ప్రేమను వదులుకోవడమా, లేక తమ జీవితాల కోసం పోరాడటమా అనే పరిస్థితి వస్తుంది. శత్రు, గుడియా చివరికి తమ ప్రేమను కాపాడుకోగలిగారా ? కుటుంబాల నుంచి వచ్చిన బెదిరింపులను ఎలా ఎదుర్కొన్నారు ? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాకు సిద్ధార్థ్ సింగ్, గరిమా వహాల్ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా వీరే రాశారు. తాహిర్ రాజ్ భాసిన్ శత్రుగా, మిథిలా పాల్కర్ గుడియాగా నటించారు. చంకీ పాండే, తన్వీ ఆజ్మీ, దర్శన్ జరీ వాలా, వ్రజేష్ హిర్జీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా 2025లో రూపొందిన హిందీ రొమాంటిక్ డ్రామా కాగా, 2026 అక్టోబర్ 6న Jio Hotstarలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం హిందీ ఆడియోలో అందుబాటులో ఉంది.