Telugu Independent Movie: సినిమాల్లో హీరో కావాలని హైదరాబాద్‌కు వచ్చే ఎంతోమంది యువకుల కలల వెనుక ఎంత కష్టం ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ? చేతిలో డబ్బు ఉండదు… ఇండస్ట్రీలో పరిచయాలు ఉండవు… ఒక్క అవకాశం కోసం ఎదురు చూపులు… రోజులు గడుస్తున్నా ఛాన్స్ మాత్రం రాదు. పైగా తన కలను నమ్మి వచ్చిన వ్యక్తికి అవమానాలు, తిరస్కారాలు ఎదురైతే ? ఇలాంటి పరిస్థితుల్లోనూ సినిమా కలను వదులుకోకుండా పోరాడే ఓ యువకుడి కథే తెలుగు ఇండిపెండెంట్ డ్రామా ‘సంజీవ్’ (Sanjeev). మరి హీరో కావాలనే అతని కల ఎంత దూరం తీసుకెళ్లింది ? ఒక్క అవకాశం కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు ? చివరికి తన కలను నెరవేర్చుకున్నాడా లేదా ? అన్నది తెలుసుకుందాం.
గ్రామీణ తెలంగాణకు చెందిన సంజీవ్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. ఎప్పటికైనా నటుడిగా తెరపై కనిపించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనేది అతని కల. అదే కలతో హైదరాబాద్‌కు వస్తాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎదురు చూడటం అనుకున్నంత సులభం కాదని అతనికి త్వరగానే అర్థమవుతుంది. ఎవరిని కలవాలి ? ఎక్కడ అవకాశం దొరుకుతుంది ? తనలో ఉన్న ప్రతిభను ఎవరు గుర్తిస్తారు ? అనే ప్రశ్నలతో రోజులు గడుస్తుంటాయి. మరోవైపు ఆర్థిక సమస్యలు. అయినా సంజీవ్ తన కలను వదులుకోడు. ఎదురయ్యే ప్రతి తిరస్కారం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినా, వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు.
అదే సమయంలో దర్శకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న శివ అతని జీవితంలోకి వస్తాడు. నటుడిగా నిలబడాలని సంజీవ్… దర్శకుడిగా సినిమా చేయాలని శివ. ఇద్దరి కలలు ఒకే చోట కలవడంతో, తమకున్న పరిమిత వనరులతోనే ఓ సినిమా చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ సినిమా తీయడం అంత సులభం కాదు. డబ్బు కావాలి, టీమ్ కావాలి, అవకాశాలు కావాలి. సంజీవ్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు వారి ప్రయత్నాలకు పెద్ద అడ్డంకిగా మారతాయి. ఒక దశలో అసలు సినిమా చేయాలనే కలే అసాధ్యంగా అనిపిస్తుంది. అయినా వాళ్లు ప్రయత్నాన్ని ఆపరు.
ఇక్కడే సినిమా అసలు పాయింట్ కనిపిస్తుంది. సంజీవ్ హీరో అవుతాడా లేదా అనేది మాత్రమే కథ కాదు. ఒక కలను నిజం చేసుకోవడానికి మనిషి ఎంతవరకు పోరాడగలడు? డబ్బు, పరిస్థితులు, తిరస్కారాలు అడ్డుగా నిలిచినా లక్ష్యాన్ని వదులుకోకుండా ఎలా ముందుకు సాగాలి? అనే అంశాలను ఈ సినిమాలో చూడవచ్చు. చివరికి సంజీవ్‌కు ఆ ఒక్క అవకాశం దొరికిందా ? శివతో కలిసి సినిమా చేయాలనే కల నెరవేరిందా ? వారి ప్రయత్నాలకు ఆర్థిక సమస్యలు అడ్డుగా నిలిచాయా ? లేక అన్ని అవరోధాలను దాటి తమ కలను నిజం చేసుకున్నారా ? అనేదే మిగతా కథ.
‘సంజీవ్’ సినిమాకు అనిల్ నక్క దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ పాత్రలో నటించారు. లయ మిర్యాల, వీరమనోహర్ కవాలి, హరీష్ పాలకుర్తి, అచ్యుత్ జీఎస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. సినిమా నిడివి సుమారు 70 నిమిషాలు ఉంటుంది. పరిమిత బడ్జెట్‌తో యువ బృందం కలిసి రూపొందించిన ఈ సినిమాను కేవలం నాలుగు రోజుల్లో చిత్రీకరించడం విశేషం. అంతేకాదు పలు జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడటంతో పాటు అవార్డులను కూడా అందుకుంది ఈ సినిమా. ‘సంజీవ్’ ప్రస్తుతం ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 21న డిజిటల్ ప్రీమియర్ అయిన ఈ సినిమా పూర్తిగా తెలుగులోనే అందుబాటులో ఉంది. సినిమాల్లోకి రావాలని కలలు కనే యువత, ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే స్ట్రగ్లర్స్, తమ కల కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని పాత్రలు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
Read Also: పిల్లాడు చెప్పే చిన్న అబద్ధం… ఏలియన్స్ ఎంట్రీతో భారీ సమస్య… ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ కేక