Batman Caped Crusader Season 2 OTT: సూపర్ హీరో కథలు అంటే చాలామందికి భారీ ఫైట్లు, సూపర్ పవర్స్ గుర్తుకొస్తాయి. కానీ బ్యాట్‌మ్యాన్ మాత్రం అందరికంటే భిన్నం. అతనికి అతీంద్రియ శక్తులు ఉండవు. తన తెలివితేటలు, డిటెక్టివ్ నైపుణ్యం, ధైర్యంతోనే శత్రువులను ఎదుర్కొంటాడు. అందుకే బ్యాట్‌మ్యాన్ కథలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అదే అనుభూతిని మరోసారి అందించేందుకు Batman Caped Crusader Season 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1940ల రెట్రో విజువల్ స్టైల్‌లో రూపొందిన ఈ యానిమేటెడ్ సిరీస్, డార్క్ వాతావరణం, సస్పెన్స్, యాక్షన్‌తో డీసీ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
గోతమ్ సిటీ మరోసారి ప్రమాదంలో పడుతుంది. ఈసారి శత్రువు కేవలం ఆయుధాలతో కాదు… నవ్వునే ఆయుధంగా మార్చుకుని నగరాన్ని వణికించేందుకు సిద్ధమవుతాడు. జోకర్ రూపొందించిన ప్రమాదకరమైన ‘లాఫింగ్ వైరస్’ నగరమంతా వ్యాపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వైరస్ బారిన పడినవారు అదుపు తప్పి నవ్వుతూనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది.
ఈ విచిత్రమైన కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత మళ్లీ బ్యాట్‌మ్యాన్‌పై పడుతుంది. సాధారణ నేరస్థులతో పోరాడినట్లు ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని అతను త్వరగానే గుర్తిస్తాడు. వైరస్ ఎలా వ్యాపిస్తోంది ? దాని వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏమిటి ? జోకర్ లక్ష్యం గోతమ్ సిటీనేనా ? లేక ఇంకా పెద్ద కుట్ర దాగి ఉందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ తన దర్యాప్తును ప్రారంభిస్తాడు.
కథ ముందుకు సాగే కొద్దీ ఒక్కో క్లూ బయట పడుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త మలుపులు, ఊహించని ప్రమాదాలు బ్యాట్‌మ్యాన్‌కు ఎదురవుతాయి. ఒకవైపు జోకర్ వేసిన ఉచ్చులను తప్పించుకుంటూనే, మరోవైపు నగర ప్రజలను కాపాడేందుకు అతను చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఈ క్రమంలో అతని డిటెక్టివ్ నైపుణ్యం, వ్యూహాలు కథలో మరింత ఉత్కంఠభరితంగా ఉంటాయి. జోకర్ అసలు ప్లాన్ ఏమిటి ? లాఫింగ్ వైరస్‌ను బ్యాట్‌మ్యాన్ ఎలా అడ్డుకున్నాడు ? గోతమ్ సిటీని మరోసారి కాపాడగలిగాడా ? చివర్లో వచ్చే మైండ్ గేమ్ ఎలా ముగిసింది? అనే అంశాల చుట్టూ సిరీస్ సాగుతుంది.
ప్రస్తుతం ఈ సిరీస్ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. 1940ల నాటి క్లాసిక్ యానిమేషన్ స్టైల్, డార్క్ విజువల్స్, గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌లో హైలెట్. యాక్షన్‌తో పాటు డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాట్‌మ్యాన్, జోకర్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ డీసీ అభిమానులను ఆకట్టుకుంటాయి. సూపర్ హీరో కథల్లో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, సస్పెన్స్, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉండాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. డార్క్ టోన్, క్లాసిక్ యానిమేషన్, బలమైన కథతో రూపొందిన ఈ సిరీస్ బ్యాట్‌మ్యాన్ అభిమానులతో పాటు క్రైమ్ థ్రిల్లర్ ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది. ఈ వీకెండ్‌లో డీసీ ప్రపంచంలోకి మరోసారి వెళ్లాలనుకుంటే ఈ సిరీస్‌ను తప్పకుండా మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోండి. భారతదేశంలో ఈ సిరీస్ ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ ఆడియోలలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: కేర్ టేకర్ గా వచ్చి కిల్లింగ్ పనులు… తెలుగులోనే ఈ మోస్ట్ అవైటింగ్ మలయాళం థ్రిల్లర్ స్ట్రీమింగ్