బోడుప్పుల్ భగ్గుమన్నది. ఉద్యమకారులంతా అక్కడి చేరుకుని భూపోరాటంలో భాగం కావడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశంతో అక్కడి పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులంతా ఛలో ఉప్పల్ భగాయత్ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాత్రి నుంచే ఉద్యమకారులను పోలీసులు అరెస్టులు చేశారు. కార్యక్రమానికి రానీయకుండా అడ్డుకున్నారు. అయినా, పోలీసులు చక్రబంధం నుంచి, అక్రమ అరెస్టుల నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఉద్యమకారులు.. ఉదయమే భూపోరాటం నిర్వహించాలని తలపెట్టిన బోడుప్పల్ ప్రాంతానికి చేరుకుని నిరసన తెలిపారు.
ఫ్లకార్డుల ప్రదర్శిస్తూ తమకు 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. టీఆరెస్ పార్టీ వేసిన టెంట్లను కూల్చేశారు. ఉద్యమకారులను, టీఆరెస్ కార్యకర్తలను చెల్లాచెదరు చేశారు. నిరసన తెలిపే వారిపై మహిళలు అని కూడా చూడకుండా లాఠీలకు పని చెప్పారు.
దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ తలెత్తాయి. అప్పుడే కవిత కూడా అక్కడికి వచ్చి పోలీసుల చర్యను నిరసిస్తూ అక్కడే బైఠాయించారు. ఉద్యమకారులు పోరాటం చేస్తున్న ప్రాంతంలోనే బొడ్రాయిని ప్రతిష్టించి కవిత పూజలు చేశారు. ఆ ప్రాంతానికి ఉద్యమకారుల రక్షణ కాలనీగా నామకరణం చేశారు. పోలీసులు కవితను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో ప్రభుత్వానికి , పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. కవితకు మద్దతుగా ఉద్యమకారులంతా నిలిచి, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను అరెస్టు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. ఉద్యమకారులు, టీఆరెస్ కార్యకర్తలు పోలీసుల చర్యను అడ్డుకున్నారు. కవితను అరెస్టు చేయకుండా ప్రతిఘటించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితి అదుపు తప్పుతున్నదని గ్రహించి లాఠీ చార్జి చేశారు.
ఈ లాఠీ చార్జిలో ఉద్యమకారులతో పాటు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఉద్యమకారులు కూడా పోలీసులను ప్రతిఘటించడం మానలేదు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరకు బలవంతంగా కవితను లాక్కుంటూ తీసుకెళ్లి పోలీస్ జీపు ఎక్కించారు. అయినా ఉద్యమకారులు పోలీసులను అడ్డగించారు. ఆ జీపును ముందుకు పోనియకుండా దానికి అడ్డంగా బైఠాయించారు. అక్కడ గంటకు పైగా ఇరువురి మధ్య యుద్ద వాతావరణం నెలకొన్నది.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కవితను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కవితతో పాటు వందలాది మంది ఉద్యమకారులను, టీఆరెస్ కార్యకర్తలను, మహిళలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కవిత మీడియాతో మాట్లాడారు.
ఉప్పల్ లో తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందన్నారు. మహిళలు, తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రమే అడిగాం తప్ప వేరే డిమాండ్లు ఏమీ అడగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్టి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని హెచ్చించారు. ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలం ఇవ్వాలని మాత్రమే అడిగాం.. కచ్చితంగా ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అడిగితే ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టటం అన్యాయమన్నారు.
ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను ఈ ప్రభుత్వానికి రోజు గుర్తు చేస్తూనే ఉంటామని, సర్కార్‌కు నిద్ర పట్టనీయమన్నారు.
బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల తర్వాత కూడా నెరవేర్చక పోవడాన్ని నిరసిస్తూ భూ పోరాటం చేపట్టిన కల్వకుంట్ల కవిత ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం పై ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవితను వెంటనే విడుదల చేయాలని కార్యకర్తల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.