రివ్యూ : క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : జియో హాట్ స్టార్
నటీనటులు : పంకజ్ త్రిపాఠి, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, సుర్వీన్ చావ్లా, ఆషా నేగి, ఖుష్బూ ఆత్రే, బర్ఖా సింగ్, శ్వేతా బసు ప్రసాద్, మీతా వశిష్ఠ్
దర్శకుడు : రోహన్ సిప్పీ
Criminal Justice a Family Matter review : క్రిమినల్ జస్టిస్ అనే కోర్టు రూమ్ డ్రామా సిరీస్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇందులో ఎప్పటిలాగా బాధితుల తరపున కాకుండా నిందితుల తరపున వాదించే లాయర్ వాదనలు, లాజిక్ లు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. అందుకే ఈ ఫ్రాంచైజీలో 4వ సిరీస్ ‘క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్’ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణకు మేకర్స్ తెరదించారు. మొదటి మూడు ఎపిసోడ్‌లు (“ఎ బర్త్‌డే టు రిమెంబర్,” “బరీడ్ సీక్రెట్స్,” “క్విడ్ ప్రో క్వో”) మే 29న విడుదలయ్యాయి. మిగిలిన ఎపిసోడ్‌లు ప్రతి గురువారం విడుదలవుతాయి. ఈ సిరీస్ JioHotstarలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషలలో అందుబాటులో ఉంది. తాజాగా హాట్ స్టార్ లోకి వచ్చిన ఈ సిరీస్ అంచనాలను అందుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
‘క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ సిరీస్ పంకజ్ త్రిపాఠి పోషించిన మాధవ్ మిశ్రా అనే న్యాయవాది చుట్టూ తిరిగే ఒక ఇంట్రెస్టింగ్ కోర్ట్‌రూమ్ డ్రామా. ఈ సీజన్‌లో మాధవ్ ఒక హై-ప్రొఫైల్ మర్డర్ కేసును తీసుకుంటాడు. ఇందులో డాక్టర్ రాజ్ నాగ్‌పాల్ (మహ్మద్ జీషాన్ అయ్యూబ్) తన ప్రియురాలు రోషిణి సలూజా (ఆషా నేగి) హత్య కేసులో నిందితుడిగా ఉంటాడు. ఆమెను కాపాడదామని వెళ్ళి ఈ కేసులో ఇరుక్కుంటాడు. స్వయంగా ఆయన భార్యే పోలీసులను పిలవడంతో పాటు లాయర్ దగ్గరకు కూడా వెళ్తుంది. నిజానికి ఆమె కూడా ఒక లాయర్. వీరిద్దరూ విడాకులు తీసుకోకుండానే ఏడాది పాటు దూరంగా ఉంటారు. పైగా వీళ్లిద్దరికీ మానసికంగా అనారోగ్యంతో ఉన్న ఓ కూతురు కూడా ఉంటుంది. ఆమెను చూసుకోవడానికి వచ్చిన నర్సే చనిపోయిన రోషిణి. ఈ కేసును లాయర్ మిశ్రా ఎలా వాదించారు? అసలైన నేరస్థుడు ఎవరు ? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
ఈ సీజన్ లో మానసిక ఆరోగ్యం, వివాహ బంధం, ఫ్యామిలీ సమస్యలు వంటి కొత్త థీమ్‌లను పరిచయం చేశారు. రచయితల బృందం హర్మన్ వడాలా, సందీప్ జైన్, సమీర్ మిశ్రా కథను భావోద్వేగ లోతుతో నడిపించే ప్రయత్నం చేశారు. అయితే మధ్య ఎపిసోడ్‌లు కొంత నెమ్మదిగా సాగినట్లు అన్పిస్తుంది. కోర్ట్‌రూమ్ సీన్స్, ముఖ్యంగా క్రాస్-ఎగ్జామినేషన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రోహన్ సిప్పీ ఈ సిరీస్‌ను పాత్రలపై దృష్టి పెట్టి నడిపించారు. కానీ ఎపిసోడ్ల విధానమే ప్రేక్షకులను నిరాశ పరిచింది. అంతేకాకుండా కథ మొత్తం ఒకే ఫార్ములాతో నడుస్తున్నట్టుగా, గత సీజన్‌లతో పోలిస్తే తాజాదనం కొరవడినట్టుగా అన్పిస్తుంది.
పంకజ్ త్రిపాఠి తన సహజమైన నటనతో మాధవ్ మిశ్రాగా మరోసారి అద్భుతంగా ఆకట్టుకున్నారు. అతని పాత్ర ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలుస్తుంది. సుర్వీన్ చావ్లా అంజు పాత్రలో లోతైన భావోద్వేగాలను చక్కగా పండించింది. శ్వేతా బసు ప్రసాద్, మీతా వశిష్ఠ్ తదితరులు బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్
పంకజ్ త్రిపాఠి నటన,
ఎమోషనల్ స్టోరీ
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
తాజాదనం లేకపోవడం
ఎపిసోడ్‌ల విడుదల విధానం
చివరగా
“క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్” పంకజ్ త్రిపాఠి అభిమానులకు, కోర్ట్‌రూమ్ డ్రామాను ఇష్టపడే వారికి బెస్ట్ ఆప్షన్. అయితే ఫార్ములాయిక్ కథనం, నెమ్మదిగా సాగే కొన్ని ఎపిసోడ్‌లు, అలాగే విడుదల విధానం నిరాశను కలిగించవచ్చు.
రేటింగ్ : 2/5