రివ్యూ : ‘గుడ్ వైఫ్’ సిరీస్
ఓటీటీ ప్లాట్‌ఫాం : జియో హాట్‌స్టార్
నటీనటులు : ప్రియమణి (తరుణిక), సంపత్ రాజ్ (గుణశీలన్), ఆరి అర్జున్ (హరి దీపక్), అమృత శ్రీనివాసన్ (స్నేహ మెర్లిన్) తదితరులు
దర్శకత్వం : రేవతి
ఎపిసోడ్‌లు : 6 (ఒక్కొక్కటి సుమారు 30-35 నిమిషాలు)
స్ట్రీమింగ్ : తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ
Good Wife Web Series Review in Telugu : జియోహాట్‌స్టార్ స్పెషల్ గా రూపొందిన ‘గుడ్ వైఫ్’ సిరీస్, అమెరికన్ హిట్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’కు అధికారిక తమిళ రీమేక్. తమిళ్ కోర్టు డ్రామాగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళి, మరాఠి… ఇలా 7 భాషల్లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. భర్తను కాపాడుకోవడం కోసం మళ్ళీ నల్లకోటు వేసుకున్న ‘గుడ్ వైఫ్’ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
తరుణిక ఒక క్రిమినల్ డిఫెన్స్ లాయర్. పెళ్లయ్యాక పిల్లలు, భర్త కోసం ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె భర్త గుణశీలన్ (సంపత్ రాజ్) ఒక గౌరవనీయ జడ్జి. సంతోషంగా ఉండే ఈ జంట తమ ఫ్యామిలీ, సన్నిహితుల మధ్య 16వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటారు. కానీ అదే రోజు తరుణి భర్త ప్రైవేట్ వీడియో లీక్ అవుతుంది. ఈ స్కాండల్ లో భాగంగా అవినీతి ఆరోపణలతో అతను జైలుకు వెళ్తాడు. ఈ సంఘటన తరుణిక కుటుంబం గౌరవాన్ని దెబ్బతీస్తుంది. తన ఇద్దరు పిల్లలను పోషించడానికి, గౌరవాన్ని తిరిగి సంపాదించడానికి తరుణిక తిరిగి న్యాయవాద వృత్తిలోకి అడుగు పెడుతుంది. హరి దీపక్ (ఆరి అర్జున్) నడిపే లా ఫర్మ్‌లో జూనియర్ అసోసియేట్‌గా చేరుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఈ హరి ఎవరు? తన భర్తను ఈ కేసులో నుంచి తరుణి ఎలా బయట పడేసింది ? అన్నది స్టోరీ.
విశ్లేషణ
సిరీస్ ఆరంభంలో ఉత్కంఠగా మొదలైనప్పటికీ, మధ్యలో కథనం నెమ్మదిగా సాగడంతో చూడాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. గుణశీలన్ కేసును పక్కన పెట్టి, కొత్త కేసులను పరిచయం చేయడం వల్ల కథ గందరగోళంగా అన్పిస్తుంది. సంతోషంగా ఉన్న ఫ్యామిలీలో చిక్కులు రావడం, ఆ సమస్యలను పరిష్కరించే కోర్టు రూమ్ డ్రామా… వంటి లైన్ తో ఇప్పటికే ఎన్నో సిరీస్ లు వచ్చాయి. కాబట్టి కథలో కొత్తదనం ఎక్కడా కనిపించదు. గుణశీలన్ ద్రోహాన్ని తరుణిక సులభంగా క్షమించడం, అతనికి బెయిల్ రావడం వంటి అంశాలను ఊహించనంత సింపుల్ గా చూపించారు. సాధారణంగా కోర్టు రూమ్ డ్రామాలలో నువ్వా నేనా అంటూ లాయర్లు వాదించే సీన్లు ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. ఈ సిరీస్ లో మాత్రం ఆ లోటు స్పష్టంగా కన్పిస్తుంది.
అలాగే కొన్ని సబ్‌ప్లాట్‌లు ఆసక్తికరంగా ఉన్నా, అవి అర్ధాంతరంగా ముగిసినట్లు అనిపించాయి. పాలిటిక్స్, ఫెర్టిలిటీ కేంద్రాల్లో అరాచకాలు, డ్రగ్స్ వంటి ఇంట్రస్టింగ్ అంశాలు ఉన్నా పేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావు. అయితే ఫ్యామిలీ కోసం ప్రియమణి పడే కష్టం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో మాత్రం ఓ ట్విస్ట్ తో సీజన్ 2 కూడా ఉంటుందని హింట్ వదిలారు. ట్రైలర్ రిలీజ్ కాగానే ప్రియమణి నుంచి ‘భామా కలాపం’ వంటి మరో అద్భుతమైన సిరీస్ రాబోతోందని అనుకున్న వారికి ఈ సిరీస్ నిరాశనే మిగిల్చింది.
ప్రియమణి తరుణిక పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె తల్లిగా, భార్యగా, న్యాయవాదిగా ఎదుర్కొనే సవాళ్లను, భావోద్వేగాలను సహజంగా తెరపై పండించింది. కానీ సంపత్ రాజ్ – ప్రియమణి మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ చూడడానికి ఏమాత్రం బాగాలేవు. ఈ జంటను తెరపై దంపతులుగా చూడడం అన్నది ఇబ్బంది పెడుతుంది. ఆరి అర్జున్ కూడా తన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇన్వెస్టిగేటర్ స్నేహ మెర్లిన్‌గా అమృత శ్రీనివాసన్ పాత్ర ఆసక్తికరంగా అన్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
ప్రియమణి
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
ప్రియమణి, సంపత్ రాజ్ కెమిస్ట్రీ
నెమ్మదిగా సాగే కథనం
మొత్తంగా
ఈ వీకెండ్ కు మాత్రం గుడ్ ఆప్షన్ కాదు.
Good Wife Web Series Rating : 1.25/5