రివ్యూ : ‘విరాటపాలెం-పీసీ మీనా రిపోర్టింగ్’సిరీస్
నటీనటులు : అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకార, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్ తదితరులు
దర్శకుడు : పోలూరు కృష్ణ
నిర్మాత : కేవీ శ్రీరామ్
సంగీత దర్శకుడు : రోహిత్ కుమార్
Viraatapalem PC Meena Reporting Review : ‘రెక్కీ’ లాంటి అద్భుతమైన సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు కృష్ణ పోలూరు… తాజాగా ‘విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్’ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అభిజ్ఞా వుతలూరు హీరోయిన్‌గా నటించిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ టీజర్, ట్రైలర్ కంటే వివాదంతోనే ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈటీవీ విన్ వారు ‘కానిస్టేబుల్ కనకం’ అనే తమ సిరీస్ ను కాపీ కొట్టారు అంటూ జీ5 పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. మరి ఈ కాంట్రవర్సీ సిరీస్ ఎలా ఉంది? ఊరికి పట్టిన శాపం ఏంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ సిరీస్ ఒంగోలు సమీపంలోని విరాటపాలెం అనే గ్రామంలో 1980ల నేపథ్యంలో జరిగే సూపర్‌న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. గ్రామంలో పెళ్లైన నవ వధువులు రక్తం కక్కుకుని మరణిస్తుండటంతో, గత 10 సంవత్సరాలుగా ఆ ఊరిలో పెళ్లిళ్లే జరగవు. ఈ మరణాలను అమ్మవారి శాపమని గ్రామస్తులు నమ్ముతారు. సర్పంచ్ (రామరాజు)పై గ్రామస్తులకు అపార నమ్మకం ఉంటుంది. సర్పంచ్ కూతురు భ్రమరాంబ (లావణ్య సాహుకర) ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది. అదే సమయంలో కానిస్టేబుల్ మీనా (అభిజ్ఞ వూతలూరు) తన తల్లి విజయమ్మతో కలిసి ట్రాన్స్‌ఫర్‌పై గ్రామానికి వస్తుంది. మరో కొత్త పెళ్లి కూతురు మల్లి తన కళ్లముందే చనిపోతుంది. దీంతో మీనా ఈ మరణాల వెనుక దాగిన రహస్యాలను ఛేదించడానికి టీ స్టాల్ యజమాని కిట్టు (చరణ్ లక్కరాజు) సహాయంతో దర్యాప్తు మొదలు పెడుతుంది. ఆ కేసును సాల్వ్ చేయడానికి ఊరి సర్పంచ్ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఈ మిస్టరీని మీనా ఛేదిస్తుందా? శాపం నిజమేనా? చివరికి మీనాకు ఏమైంది? అనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
సిరీస్ మొదట ఆసక్తికరంగా మొదలైనప్పటికీ, స్క్రీన్‌ప్లే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లు లేక, ఊహించదగిన మలుపులతో నిరాశపరిచింది. క్లైమాక్స్ ట్విస్ట్ సిల్లీగా అన్పిస్తుంది. విరాటపాలెం గ్రామంలో నవ వధువుల మరణాలు, శాపం అనే కొత్త స్ట్రాంగ్ స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికీ, దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ చేతులెత్తేశారు. మొదటి రెండు ఎపిసోడ్‌లు క్యారెక్టర్స్‌ను పరిచయం చేయడానికే సాగదీశారు. విజువల్స్, నిర్మాణ విలువలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ దారుణంగా ఉన్నాయి. చరణ్ లక్కరాజు (కిట్టు), లావణ్య సాహుకర (భ్రమరాంబ) వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ అసలు ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. హీరోయిన్ అభిజ్ఞ వూతలూరు తన యాక్టింగ్ తో ఫర్వాలేదు అన్పించింది. పెద్దగా చెప్పుకోవడానికేమీ క్రైమ్ థ్రిల్లర్.
చివరగా
సూపర్‌న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీలు ఇష్టపడేవారు ఓసారి అంచనాలు లేకుండా చూడవచ్చు.
Viraatapalem Rating : 1.5/5