Antikythera Mechanism: సుమారు 120 ఏళ్ల కిందట గ్రీస్ దేశం దగ్గర్లోని ఆంటికిథెరా అనే ఒక చిన్న దీవి ఒడ్డున ముత్యాల కోసం కొందరు ఈతగాళ్లు సముద్రంలో మునుగుతున్నారు. ఆ సమయంలో నీటి అడుగున నీళ్లలో మునిగిపోయిన ఒక పాత ఓడ కనిపించింది. దాంట్లో నుంచి వారు కొన్ని విగ్రహాలు, రకరకాల వస్తువులను బయటకు తీశారు. వాటితో పాటే బాగా తుప్పు పట్టి, గట్టి పడిపోయిన ఒక చిన్న లోహపు ముక్క కూడా దొరికింది. మొదట్లో ఎవరూ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, అదొక రాగి ముక్క అని వదిలేశారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ వస్తువు గురించి తెలిసిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సముద్రంలో దొరికిన ఆ వింత వస్తువే ‘ఆంటికిథెరా యంత్రం’.
చాలా కాలం పాటు శాస్త్రవేత్తలు ఆ లోహపు ముక్కను పరీక్షించడానికి ప్రయత్నించారు. కానీ అది బాగా పాడైపోవడం వల్ల లోపల ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఆధునిక ఎక్స్-రే, స్కానింగ్ యంత్రాలు వచ్చాక దాని లోపల ఉన్న రహస్యాన్ని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. అందులో పళ్లు ఉన్న చిన్న చిన్న ఇత్తడి చక్రాలు దాదాపు 35 వరకు ఉన్నాయి. అవన్నీ ఒకదానికొకటి కలిసి చాలా విచిత్రంగా పనిచేసేలా అమర్చబడి ఉన్నాయి. ఇది దాదాపు 2000 ఏళ్ల కిందటిది అని, అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినదని పరిశోధకులు తేల్చారు. ఆ కాలంలోనే మనుషులకు ఇంత గొప్ప తెలివితేటలు ఉన్నాయా అని అంతా ఆశ్చర్యపోయారు.
ఈ రోజుల్లో మనం వాడుతున్న కంప్యూటర్లు కేవలం వంద ఏళ్ల కిందట మాత్రమే వచ్చాయి. కానీ రెండు వేల ఏళ్ల కిందటే గ్రీకులు తయారు చేసిన ఈ పరికరాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన యంత్రంగా చెబుతారు. ఇందులో ఎలాంటి కరెంటు కానీ, బ్యాటరీలు కానీ లేవు. ఒక చిన్న కడ్డీని చేతితో తిప్పితే చాలు, లోపల ఉన్న చక్రాలన్నీ ఒక పద్ధతి ప్రకారం తిరిగేవి. ఇది మన చేతి గడియారం కంటే కూడా చాలా సంక్లిష్టంగా పనిచేసేది. అప్పటి కాలంలోనే మనుషుల దగ్గర ఉన్న సాంకేతికతకు, తెలివితేటలకు ఈ యంత్రం ఒక మంచి ఉదాహరణ.
Also Read: ధర ఎక్కువైనా వర్త్ అనిపించే ఫీచర్లు.. OnePlus 16లో రాబోతున్న క్రేజీ చేంజెస్ ఇవే!
ఈ యంత్రాన్ని కేవలం సమయం తెలుసుకోవడానికి మాత్రమే వాడలేదు. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, మిగతా గ్రహాలు ఏ సమయంలో ఎక్కడ ఉంటాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించేవారు. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఎప్పుడు వస్తాయి? ఏ టైమ్‌కి జరుగుతాయి.. అనేది ఈ యంత్రం ద్వారా ముందే అంచనా వేసేవారు. అలాగే చంద్రుడి కదలికలను బట్టి సముద్రంలో అలలు ఎలా వస్తాయో కూడా తెలుసుకునేవారు. గ్రీకులకు ఎంతో ఇష్టమైన ఒలింపిక్ ఆటలు ఏ సంవత్సరంలో ప్రారంభమవుతాయో చెప్పడానికి కూడా ఇందులో ప్రత్యేకమైన చక్రాలు ఉండేవి.
ఈ అద్భుతమైన యంత్రాన్ని ఎవరు తయారు చేశారనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కాలపు గొప్ప సైంటిస్ట్ ఆర్కిమిడీస్ ఆలోచనలతో ఇది తయారై ఉంటుందని చాలామంది అనుకుంటారు. లేదా హిప్పార్కస్ అనే ఖగోళ శాస్త్రవేత్త దీనిని డిజైన్ చేసి ఉండవచ్చని చెబుతారు. ప్రాచీన గ్రీకులు సముద్రంలో ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే పంటలు వేసేటప్పుడు కాలాన్ని, వాతావరణాన్ని తెలుసుకోవడానికి దీనిని తయారు చేసుకున్నారు. అప్పట్లో ఇలాంటివి పెద్ద పెద్ద చదువుకున్న వారి దగ్గర లేదా రాజుల దగ్గర మాత్రమే ఉండేవి.
ఈ ఆంటికిథెరా యంత్రం దొరికే వరకు మనందరం ఒకలా అనుకునేవాళ్లం. పాతకాలంలో ప్రజలకు యంత్రాల గురించి పెద్దగా తెలియదని భావించేవాళ్లం. కానీ ఈ యంత్రం దొరికాక ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. వందల ఏళ్ల కిందట యూరప్‌లో పెద్ద పెద్ద గడియారాలు రాకముందే, అంతకంటే 1000 సంవత్సరాల క్రితమే గ్రీకులు ఇంత గొప్ప పరికరాన్ని తయారు చేశారని నిరూపితమైంది. ఈ యంత్రం గనక సముద్రంలో మునిగిపోకుండా ఉండి ఉంటే.. మన సైన్స్ ఇంకా ఎంతో ముందుకు వెళ్లేదని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. సముద్రం లోపల దొరికిన ఈ ఒక్క చిన్న వస్తువు ప్రాచీన మానవుడి తెలివితేటలకు పెద్ద సాక్ష్యంగా నిలిచింది.
Also Read: కెమెరా ఉన్న ఎయిర్‌పాడ్స్.. డిజైన్ మారిన వాచ్ అల్ట్రా.. యాపిల్ 2026 ఈవెంట్‌పైనే అందరి కళ్లు!