Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే మీ కంప్యూటర్‌లో క్రోమ్ వెర్షన్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. సెప్టెంబర్ 24న CERT-In క్రోమ్ డెస్క్‌టాప్ వెర్షన్లలో పలు భద్రతా లోపాలు ఉన్నాయని హెచ్చరించింది. ఈ సమస్యలను ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం, ప్రమాదకరమైన కోడ్‌ను నడపడం లేదా కంప్యూటర్‌పై నియంత్రణ సాధించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా వంటి పనులు చేసే సమయంలో బ్రౌజర్ భద్రతను నిర్లక్ష్యం చేయొద్దు. అందుకే ఈ చిన్న అప్‌డేట్‌తో పెద్ద సమస్యను ముందుగానే తప్పించుకోవచ్చు.
CERT-In ప్రకారం.. Windows, Macలో 153.0.8010.52/.53 కంటే ముందు వెర్షన్లు, Linuxలో 153.0.8010.52 కంటే ముందు వెర్షన్లు ప్రభావితమయ్యాయి. ఈ లోపాలకు హై రిస్క్‌గా రేటింగ్ ఇచ్చారు. Chromeలోని PDFium, Extensions, WebGL, Skia, FileSystem, Omnibox, Permissions, DataTransfer వంటి భాగాల్లో సమస్యలు గుర్తించారు. Google ఇప్పటికే ఈ లోపాలను పరిష్కరించే అప్‌డేట్లను విడుదల చేసింది.
ప్రత్యేకంగా తయారు చేసిన వెబ్ రిక్వెస్ట్ లేదా హానికరమైన వెబ్ కంటెంట్‌ను ఓపెన్ చేయించేలా యూజర్‌ను మోసం చేయడం ద్వారా బురిడీ కొట్టించే అవకాశం ఉంది. అలా జరిగితే సున్నితమైన సమాచారం బయటకు వెళ్లడం, భద్రతా నియమాలను దాటేయడం, నకిలీ పేజీలు లేదా సందేశాల ద్వారా మోసం చేయడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో కంప్యూటర్‌లో హానికరమైన కోడ్ కూడా నడిచే అవకాశం ఉంది.
Also Read: కేబుల్‌తో ఛార్జ్ చేయాలా? వైర్‌లెస్‌గా చేయాలా? AirPods విషయంలో ఇదిగో ఫుల్ క్లారిటీ!
ఇది Chromeను కంప్యూటర్‌లో వాడే సాధారణ యూజర్లతో పాటు సంస్థలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఆఫీస్ కంప్యూటర్లలో పాత క్రోమ్ వెర్షన్ ఉంటే.. ఆలస్యం చేయకుండా అప్‌డేట్ చేయడం మంచిది. తెలియని వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకుండా ఉండటం కూడా ఉపయోగపడుతుంది.
క్రోమ్ ఓపెన్ చేసి కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేయండి. తర్వాత Help, About Google Chromeలోకి వెళ్లండి. అక్కడ మీ బ్రౌజర్ వెర్షన్ కనిపిస్తుంది. అప్‌డేట్ అందుబాటులో ఉంటే Chrome దాన్ని డౌన్‌లోడ్ చేసి, రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. గూగుల్ సెప్టెంబర్ 22న Chrome 154 స్థిరమైన వెర్షన్‌ను విడుదల చేసింది. కాబట్టి అందుబాటులో ఉన్న తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
బ్రౌజర్‌లో భద్రతా లోపాలు ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకుండా వాడటం వల్ల ప్రమాదం పెరగొచ్చు. CERT-In హెచ్చరిక ప్రకారం.. ఈ లోపాలతో సున్నితమైన సమాచారం బయటపడటం, కోడ్ నడవటం, సిస్టమ్‌కు ఇబ్బంది కలగడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే అప్‌డేట్‌ను వాయిదా వేయకుండా ఇప్పుడే క్రోమ్ వెర్షన్ చెక్ చేసి తాజా అప్‌డేట్ ఉంటే ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది. ఇది ప్రతి గూగుల్ క్రోమ్ యూజర్ పాటించాల్సిన జాగ్రత్త.
Also Read: కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్.. భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?