Google Maps Offline Mode: రోజువారీ ప్రయాణాల్లో లేదా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇంటర్నెట్ సరిగ్గా లేని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆఫ్‌లైన్ మ్యాప్స్ ఫీచర్ ఎంతగానో ఆదుకుంటుంది. మనకు కావలసిన ఏరియాను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకుని ఇంటర్నెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. కాకపోతే ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్స్ లోని అన్ని సర్వీసులు పనిచేయవు. కొన్ని పరిమితులు ఉంటాయి. అవేటంటే..
మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌లో వాడుతున్నప్పుడు లైవ్ ట్రాఫిక్ సమాచారం లభించదు. రద్దీని బట్టి మార్గాలు మారే డెటూర్స్, ఏ వ్యాపార సంస్థ వద్ద ఎంతమంది జనం ఉన్నారో తెలిపే ఇండికేటర్లు కనిపించవు. అలాగే కేవలం కార్లు, బైక్‌ల వంటి వాహనాల ప్రయాణాలకు మాత్రమే టర్న్ బై టర్న్ నావిగేషన్ పనిచేస్తుంది. కాలినడకన వెళ్లేవారికి, సైక్లింగ్ చేసేవారికి, మెట్రో లేదా బస్సు సమాచారం కోరుకునేవారికి ఇది పనిచేయదు. రైడ్ హెయిలింగ్ యాప్స్ లేదా సైకిల్ షేరింగ్ సేవలు కూడా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండవు.
Also Read: రూ.17,999 ధరకే కేక పుట్టించే 5G టాబ్లెట్.. 8000mAh బ్యాటరీతో Ai+ NovaTab లాంచ్!
ఆఫ్‌లైన్ మ్యాప్‌లో ప్రదేశాలు కనిపిస్తాయి కానీ వాటికి సంబంధించిన కీలక సమాచారం లభించదు. ఆయా ప్రాంతాల యూజర్ రివ్యూలు, అసలైన ఫొటోలు, స్ట్రీట్ వ్యూ చిత్రాలు చూడలేం. ప్రదేశాన్ని కళ్లారా చూసి నిర్ధారించుకునే సదుపాయం ఉండదు. కాకపోతే ఈ ఆఫ్‌లైన్ మ్యాప్స్ సైజు కొన్ని మెగాబైట్ల నుంచి కొన్ని గిగాబైట్ల వరకు మాత్రమే ఉంటుంది. వైఫై లేని సమయంలో లేదా వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు డేటా ఛార్జీల భారం పడకుండా ఇవి బాగా ఉపయోగపడతాయి.
గూగుల్ మ్యాప్స్‌లో ప్రదేశాన్ని శోధించి డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా సులభం. ఆండ్రాయిడ్ ఆటో లేదా ఆపిల్ కార్ ప్లే ద్వారా కార్ డిస్‌ప్లేలో ఆఫ్‌లైన్ నావిగేషన్ వాడుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా టోల్ రోడ్లు, హైవేలు వద్దనుకుంటే ఆ రూట్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. అయితే ప్రయాణ సమయం మాత్రం సాధారణ ట్రాఫిక్ ఆధారంగానే చూపిస్తుంది. నెట్ లేకపోయినా లొకేషన్ చిరునామా, ఫోన్ నంబర్, షాపుల పని వేళలు, సగటు స్టార్ రేటింగ్స్ వంటివి స్పష్టంగా కనిపిస్తాయి.
మనం వెళ్లాలనుకునే లొకేషన్లను ఆఫ్‌లైన్ కోసం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. నెట్ అందుబాటులో ఉన్నప్పుడే నోట్స్ ఆప్షన్‌లో ముందే కొన్ని వివరాలు రాసి పెట్టుకోవడం మంచిది. హోటల్ అడ్మిషన్ ధరలు, భోజన సదుపాయాల వివరాలు నోట్స్ రూపంలో రాసుకుంటే సిగ్నల్ లేనిచోట కూడా ఆ సమాచారం చూసుకోవచ్చు. మొత్తానికి నెట్ లేని ప్రయాణాల్లో గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ ఫీచర్ మనకు గొప్ప దారి చూపే మిత్రుడిలా సహాయపడుతుంది.
Also Read: Apple Pay వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తో పేమెంట్స్ మరింత ఈజీ, ఎలా వాడాలో తెలుసా?