USB 2.0 vs USB 3.0: ఆ రోజుల్లో డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైళ్లను భద్రపరుచుకోవడానికి చాలామంది పెన్ డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లు వినియోగిస్తున్నారు. అలాగే కీబోర్డ్, మౌస్, ప్రింటర్ వంటి సాధనాలను కంప్యూటర్లకు అనుసంధానించేందుకు కూడా ‘యూఎస్‌బీ’ (USB) తప్పనిసరిగా మారిపోయింది. అయితే కొత్తగా యూఎస్‌బీ డ్రైవ్ కొనేటప్పుడు మార్కెట్లో ఉన్న ‘USB 2.0’, ‘USB 3.0’ వెర్షన్లను చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏది కొనాలో తెలియక గందరగోళం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య తేడాలేంటి? ఏది తీసుకుంటే ఎక్కువ మేలు? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం.
యూఎస్‌బీ (USB) అంటే ‘యూనివర్సల్ సీరియల్ బస్’ (Universal Serial Bus). ఇది కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి వేగంగా అనుసంధానించే సాంకేతికత. ఇది పరికరాల మధ్య డేటాను ట్రాన్స్ ఫర్ చేయడంతో పాటు వాటికి అవసరమైన విద్యుత్ (పవర్) సరఫరాను కూడా అందిస్తుంది. కాలక్రమేణా ఈ సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చి, వేగవంతమైన కొత్త వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
USB 2.0, USB 3.0ల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వాటి ‘డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్’ (వేగం). USB 2.0 వేగం సెకనుకు 480 మెగాబిట్లు (సుమారు 60 MB/s) కాగా.. USB 3.0 సెకనుకు ఏకంగా 5 గిగాబిట్ల (సుమారు 625 MB/s) వేగాన్ని అందుకుంటుంది. దీనిని బట్టి చూస్తే USB 3.0 అనేది USB 2.0 కంటే అనేక రెట్లు వేగంగా డేటాను బదిలీ చేయగలదని అర్థమవుతోంది. కాబట్టి పెద్ద సైజు ఉన్న వీడియో ఫైళ్లు, హైక్వాలిటీ ఫోటోలు, భారీ గేమ్స్ తరచూ కాపీ చేస్తుంటే USB 3.0 బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
కేవలం వేగంలోనే కాకుండా పరికరాలకు విద్యుత్ అందించే సామర్థ్యంలోనూ USB 3.0 మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. USB 2.0 గరిష్టంగా 500 మిల్లీయంపియర్స్ పవర్‌ను మాత్రమే అందిస్తే.. USB 3.0 మాత్రం 900 మిల్లీయంపియర్స్ వరకు పవర్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లు సరిగ్గా పనిచేయడమే కాకుండా కనెక్ట్ చేసిన పరికరాలు కూడా వేగంగా ఛార్జ్ అయ్యేందుకు వీలు కలుగుతుంది.
ఈ రెండు యూఎస్‌బీల మధ్య తేడాను సులభంగానే గుర్తించవచ్చు. సాధారణంగా USB 3.0 పోర్ట్ లేదా కనెక్టర్ లోపల ఉన్న ప్లాస్టిక్ భాగం నీలి రంగులో ఉంటుంది. అదే USB 2.0 పోర్ట్ లోపల భాగం నలుపు లేదా తెలుపు రంగులో కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని కంపెనీలు USB 3.0 పరికరాలపై ‘సూపర్ స్పీడ్’ (SS) అని రాస్తుంటాయి. అయితే అన్ని కంపెనీలు రంగులపరంగా ఇదే ఫార్మూలానా ఫాలో కాకపోవచ్చు. కాబట్టి కొనేముందు ప్యాకింగ్‌పై ఉన్న వివరాలను సరిచూసుకోవడం మంచిది.
Also Read: జియో రూ.499 ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో ఫ్యామిలీ మెుత్తానికి.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీలు!
మీరు కొనే యూఎస్‌బీ అనేది పూర్తిగా మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీరు కేవలం డాక్యుమెంట్లు, పీడీఎఫ్ ఫైళ్లు, చిన్న చిన్న ఫొటోలు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయడానికి అయితే USB 2.0 సరిపోతుంది. ఒకవేళ తరచుగా పెద్ద పెద్ద ఫైళ్లు కాపీ చేయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, గేమింగ్ వంటి వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ కోరుకుంటే మాత్రం USB 3.0 పోర్ట్ లేదా డ్రైవ్‌నే ఎంచుకోవడం ఉత్తమం.
Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. పిల్లలు, వృద్ధులు, యువత కోసం.. అధిక వడ్డీతో 3 సూపర్ స్కీమ్స్!