Google Takeout: Gmailలోని ముఖ్యమైన ఈ-మెయిల్స్.. Google Photosలోని మధురమైన జ్ఞాపకాలు.. Driveలో దాచుకున్న కీలకమైన ఫైల్స్.. Contactsలోని ఫోన్ నంబర్లు.. YouTubeలోని డేటా.. ఇలా మన డిజిటల్ జీవితానికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారం Google Accountలోనే ఉంటుంది. ఏళ్ల తరబడి పోగైన ఈ డేటా ఒక్కసారిగా పోతే పరిస్థితి ఏంటి? అందుకే ఎప్పటికప్పుడు దాని బ్యాకప్ తీసుకోవడం మంచిది.
ప్రస్తుతం గూగుల్ అందిస్తున్న ఉచిత సదుపాయమే Google Takeout. దీని ద్వారా మన గూగుల్ అకౌంట్‌లో ఉన్న ఫొటోలు, ఈ-మెయిల్స్, ఫైల్స్, కాంటాక్ట్స్ సహా మనకు అవసరమైన డేటాను సులభంగా ఎంచుకుని, ఒక కాపీని కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకీ Google Takeout ఎలా పనిచేస్తుంది? మనకు అవసరమైన డేటాను ఎలా ఎంచుకోవాలి? దాన్ని సురక్షితంగా ఎలా బ్యాకప్ తీసుకోవాలి? అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
గూగుల్ టేక్అవుట్ అనేది మన అకౌంట్‌లో ఉన్న సమాచారాన్ని కాపీ చేసి బ్యాకప్ తీసుకోవడానికి ఉపయోగపడే ఒక ఉచిత టూల్. దీని ద్వారా మన ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకున్నంత మాత్రాన గూగుల్‌లో ఉన్న అసలు సమాచారం డిలీట్ అయిపోదు. కేవలం ఒక కాపీ మాత్రమే మనకు అందుతుంది. కాబట్టి.. మన వ్యక్తిగత వివరాలు పోతాయనే భయం లేకుండా ప్రశాంతంగా బ్యాకప్ తీసుకోవచ్చు.
Also Read: రూ.3,300కే అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్.. 21 రోజుల బ్యాటరీ, 50+ వర్కౌట్ మోడ్స్!
ముందుగా గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయి టేక్అవుట్ పేజీకి వెళ్లాలి. అక్కడ గూగుల్‌కి చెందిన అన్ని సర్వీసుల జాబితా కనిపిస్తుంది. మీకు ఏ డేటా కావాలో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదా: కేవలం ఫోటోలు, కాంటాక్ట్స్ మాత్రమే కావాలనుకుంటే మిగిలినవి తీసేయవచ్చు. దీనివల్ల ఫైల్ సైజ్ తగ్గి, చాలా త్వరగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది.
డేటా సెలెక్ట్ చేసుకున్నాక అది మీకు ఎలా రావాలో ఎంచుకోవాలి. ఈ ఫైల్ లింక్‌ను ఈ-మెయిల్ ద్వారా పొందవచ్చు లేదా నేరుగా గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్‌లోకి పంపుకోవచ్చు. జిప్ (ZIP) ఫార్మాట్‌లో ఫైల్ పొందితే దాన్ని ఓపెన్ చేయడం సులభం. డేటా ఎక్కువ ఉంటే చిన్న చిన్న భాగాలుగా ఫైళ్లను గూగుల్ తయారు చేస్తుంది.
అన్నీ సరి చూసుకున్నాక ఆర్డర్ ఇస్తే.. మీ డేటా పరిమాణాన్ని బట్టి గూగుల్ ఒక ఈ-మెయిల్ పంపుతుంది. అందులోని లింక్ ద్వారా ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీ వ్యక్తిగత సమాచారం, ఈ-మెయిళ్లు ఉంటాయి కాబట్టి.. ఈ ఫైళ్లను చాలా జాగ్రత్తగా, సురక్షితమైన ప్రదేశంలో దాచుకోవడం మంచిది. ఆఫీస్ లేదా కాలేజ్ అకౌంట్లకు కొన్ని పరిమితులు ఉంటాయని గుర్తుంచుకోండి.
Also Read: ఒకే ధరకు రెండు దిగ్గజ ఫోన్లు.. కెమెరా, పనితీరులో ఏది బెటరంటే?