Jio Smart Wearables IMC 2026: భారత్‌లో డిజిటల్ పేమెంట్స్‌కు UPI ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ, టిఫిన్ నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, క్యాబ్‌లు, ఆన్‌లైన్ కొనుగోళ్ల వరకు.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో పేమెంట్ చేసేస్తున్నాం. QR కోడ్ స్కాన్ చేసి UPI పేమెంట్ చేయడం ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది.
అయితే ఈ పేమెంట్ అనుభవం కూడా త్వరలో మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఫోన్‌ను జేబులోంచి బయటకు తీయకుండానే కేవలం స్మార్ట్ గ్లాసెస్‌తో QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే టెక్నాలజీని రిలయన్స్ జియో ప్రదర్శించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో జియో చూపించిన కొత్త AI స్మార్ట్ గ్లాసెస్, AI ఇయర్‌బడ్స్ టెక్ రంగంలో ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఈ ఎగ్జిబిషన్‌లో జియో రెండు విభిన్న మోడళ్ల గ్లాసెస్‌ను ప్రదర్శించింది. అందులో మొదటిది కేవలం ఆడియో అవసరాల కోసం డిజైన్ చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్ మోడల్. దీనికి ఎలాంటి వైర్లు ఉండవు. రెండోది అత్యంత ఆకర్షణీయంగా నిలిచిన కెమెరా మోడల్. ఈ కెమెరా గ్లాసెస్ మనం దేనివైపు చూస్తున్నామో అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా సమాచారాన్ని మనకు అందిస్తాయి.
Also Read: పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!
ఈ కెమెరా గ్లాసెస్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం యూపీఐ పేమెంట్ ఫీచర్. మనం షాప్‌లో ఏదైనా కొన్నప్పుడు ఫోన్ అన్ లాక్ చేసి, యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. ఈ గ్లాసెస్ కెమెరాతో క్యూఆర్ కోడ్ చూసి నేరుగా పేమెంట్ పూర్తి చేయవచ్చని జియో డెమో ఇచ్చింది. అయితే దీని సెక్యూరిటీ విధానం, లావాదేవీల పరిమితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
జియో ఈ పరికరాలన్నింటికీ వాయిస్ కంట్రోల్‌ను ప్రధాన ఇంటర్‌ఫేస్‌గా మార్చింది. వినియోగదారులు కేవలం Hello Jio అని పిలిస్తే చాలు.. ఏఐ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. స్క్రీన్ చూస్తూ టైప్ చేసే శ్రమ లేకుండా, నేరుగా మాట్లాడి మనకు కావాల్సిన సమాధానాలు లేదా వివరాలు వేగంగా తెలుసుకోవచ్చు.
గ్లాసెస్‌తో పాటు జియో కొత్త ఏఐ ఇయర్ బడ్స్‌ను కూడా తీసుకొస్తోంది. ఇవి కేవలం పాటలు వినడానికి లేదా కాల్స్ మాట్లాడటానికి మాత్రమే కాకుండా, రోడ్డుపై వెళ్లేటప్పుడు లైవ్ నేవిగేషన్ గైడెన్స్ ఇస్తాయి. మనం ఫోన్ మ్యాప్స్ వైపు చూడకుండానే, చెవిలో చెప్పే సూచనల ఆధారంగా అనుకున్న ప్రాంతానికి చేరుకోవచ్చు.
ప్రస్తుతానికి ఇవి కేవలం డెమో దశలోనే ఉన్నప్పటికీ, గ్యాడ్జెట్స్ 360 నివేదిక ప్రకారం డిసెంబర్ 2026 నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మెటా, శాంసంగ్ వంటి అంతర్జాతీయ సంస్థలకు పోటీగా, భారతీయ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా జియో ఈ ఏఐ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
Also Read: ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!