Ocean Alkalinity: అనంతమైన సముద్రంలో ఒక ఓడ వేగంగా కదులుతోంది. దాని గుండా ప్రకాశవంతమైన పింక్ రంగు ద్రవం నీటిలోకి దారాలుగా పడుతోంది. హాలీవుడ్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ సీన్ లా అనిపించే ఈ దృశ్యం నిజంగా జరిగింది. పర్యావరణాన్ని కాపాడేందుకు శాస్త్రవేత్తలు అనుమతితో నిర్వహించిన ఒక సరికొత్త ప్రయోగం.. గతేడాది ఆగస్టులో నిర్వహించారు. శాస్త్రవేత్తల బృందం ‘గల్ఫ్ ఆఫ్ మైన్’ సముద్ర జలాల్లోకి ఏకంగా 16,500 గ్యాలన్ల శుద్ధి చేసిన ‘సోడియం హైడ్రాక్సైడ్’ లేదా ‘లై’ ని విడుదల చేసింది. అయితే శాస్త్రవేత్తలు ఇలా ఎందుకు చేశారు? దీని వల్ల సముద్రానికి కలిగిన ప్రయోజనం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
మనుషులు వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్‌లో అధిక భాగాన్ని సముద్రాలే పీల్చుకుంటున్నాయి. ఇది భూతాపాన్ని తగ్గించడానికి సహాయపడుతున్నప్పటికీ నీటిని తీవ్రమైన ఆమ్లత్వంగా (Acidic) మారుస్తోంది. ఈ మార్పు వల్ల గుల్లలు, నత్తలు, ఇతర సముద్ర జీవుల మనుగడ ప్రమాదంలో పడుతోంది. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు ‘ఓషన్ ఆల్కలైనిటీ ఎన్‌హాన్స్‌మెంట్’ (సముద్రంలో క్షార గుణం పెంపు) అనే పద్ధతిని పరీక్షించారు. సాధారణంగా కడుపులో ఎసిడిటీకి ‘యాంటాసిడ్’ ఎలా పనిచేస్తుందో సముద్రపు ఎసిడిటీని తగ్గించడానికి ‘లై’ వంటి క్షారాన్ని (Base) నీటిలో కలిపారు. దీనివల్ల నీరు మరింత ఆమ్లత్వంగా మారకుండానే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ ప్రయోగానికి అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) అనుమతి ఇచ్చింది. తాగునీటి పీహెచ్ (pH) స్థాయిలను సరిచేయడానికి వాడే అత్యంత శుద్ధి చేసిన సోడియం హైడ్రాక్సైడ్‌నే దీనికి ఉపయోగించారు. ఒక నౌక ద్వారా ‘విల్కిన్సన్ బేసిన్’ పరిధిలోని సముద్రంలో సుమారు ఆరు గంటల పాటు ఈ ద్రవాన్ని కలిపారు. దీనితో పాటు ‘రోడమైన్ వాటర్ ట్రేసర్’ అనే ప్రకాశవంతమైన పింక్ రంగు డైని ఉపయోగించారు. దీనివల్ల ఆ రసాయనం ఎంతవరకు విస్తరిస్తోందో శాస్త్రవేత్తలకు స్పష్టంగా కనిపించింది. ఐదు రోజుల పాటు నౌకలు, రోబోటిక్ గ్లైడర్లు, అండర్ వాటర్ వాహనాలు, శాటిలైట్ల ద్వారా సైంటిస్టులు నీటిని నిశితంగా పరిశీలించారు.
రసాయనం కలిపిన నీటి హీహెచ్, కార్బన్ పరిమాణాలను పరిశీలించిన తర్వాత.. చికిత్స చేసిన నీరు సాధారణ నీటి కంటే గాలిలోని ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించినట్లు తేలింది. పర్యావరణ పరంగా అక్కడ సేకరించిన నీటి నమూనాల జీవశాస్త్ర ఫలితాలు కూడా ఎంతో ఆశాజనకంగా వచ్చాయి. ఆ ప్రాంతంలో ఉన్న బాక్టీరియా, మైక్రోస్కోపిక్ జీవులు (ఫైటోప్లాంక్టన్), జూప్లాంక్టన్లతో పాటు చేపలు, రొయ్యల పిల్లలపై కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావం పడలేదు. ఈ ప్రయోగం ఆ పరిసరాల్లోని జీవులపై ఎలాంటి హానికర ప్రభావాన్ని చూపలేదని పరిశోధనల్లో పాల్గొన్న రుట్జర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలు రేచెల్ డావిట్ ధృవీకరించారు.
Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. పిల్లలు, వృద్ధులు, యువత కోసం.. అధిక వడ్డీతో 3 సూపర్ స్కీమ్స్!
అయితే విశాలమైన సముద్రంలో ఇది చాలా చిన్న పరిధిలో నిర్వహించిన ప్రాథమిక ప్రయోగం మాత్రమే. సముద్రంలో పెద్ద పెద్ద జీవులపై, అలాగే చేపల వేట ఆధారపడిన మత్స్య పరిశ్రమపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకా పూర్తిగా తేలలేదు. దీనిపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు లోతైన విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిశోధన ముఖ్య ఆర్గనైజర్ ఆడమ్ సుభాస్ మాట్లాడుతూ.. ‘సముద్రాల ద్వారా కార్బన్‌ను తగ్గించడం అనేది ఒక పరిష్కారం మాత్రమే. అంతమాత్రాన మానవాళి కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం లేదని అనుకోకూడదు’ అని అన్నారు.
Also Read: ఇదెక్కడి విచిత్రం సామీ.. 15 ఏళ్లుగా రాఖీ కట్టిన అన్ననే పెళ్లాడిన చెల్లెలు!