TRAI New Rules: ఈ మధ్యకాలంలో స్మార్ట్ టీవీల వినియోగం బాగా పెరిగిపోయింది. కేబుల్ లేదా డీటీహెచ్ కనెక్షన్లకు ప్రతి నెలా బిల్లు చెల్లించే బదులు.. ఇంట్లోని వైఫై, ఇంటర్నెట్ సాయంతో ఉచితంగా టీవీ ఛానళ్లు, వివిధ యాప్‌లను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలాంటి నెలవారీ చార్జీలు లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించే అవకాశం ఉండటంతో చాలామంది ఈ విధానానికే మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇలా ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా టీవీ ఛానళ్లు చూస్తున్న వారికి త్వరలోనే షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్నెట్ ఆధారిత ప్రసారాలపై భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) దృష్టి సారించడమే ఇందుకు కారణంగా మారింది.
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు.. ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా ఛానళ్లను అందించే ఫాస్ట్, యాప్ ఆధారిత టీవీ సేవలను కూడా క్రమబద్ధీకరించాలని ట్రాయ్ భావిస్తోంది. ఇప్పటివరకు సాంప్రదాయ కేబుల్, డీటీహెచ్ రంగానికే పరిమితమైన నిబంధనలను ఇంటర్నెట్ టీవీ ప్రసారాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తోంది. ఇంటర్నెట్‌లో ప్రసారమయ్యే టీవీ సేవలకు లైసెన్సింగ్ విధానం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉంది.
Also Read: వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!
ట్రాయ్ ఆలోచనపై టీవీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లు తీవ్రమైన నిబంధనలు, పన్నులు పాటిస్తుంటే.. ఇంటర్నెట్ సంస్థలకు ఆ మినహాయింపులు ఉండటం సరికాదని కేబుల్ రంగానికి చెందినవారు వాదిస్తున్నారు. మరోవైపు ఓటీటీ, టెక్ కంపెనీలు ఈ మార్పులను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తాము కేవలం ఇంటర్నెట్‌ను వేదికగా వాడుకుంటున్నామని, తమను కేబుల్ టీవీ చట్టాల కిందకు తీసుకురావడం సరికాదని, ప్రస్తుత ఐటీ చట్టాలే సరిపోతాయని స్పష్టం చేస్తున్నాయి.
ఒకవేళ ట్రాయ్ ప్రతిపాదించిన నియమాలు అమల్లోకి వస్తే.. ఇంటర్నెట్ టీవీ రంగంలో చాలా మార్పులు వస్తాయి. ఒకవైపు కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం, ప్రకటనల నియంత్రణ, నాణ్యత విషయంలో వీక్షకులకు ప్రయోజనం కలుగుతుంది. అశ్లీలత లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్‌కు అడ్డుకట్ట పడుతుంది. అయితే, ఈ కంపెనీలపై లైసెన్స్ ఫీజుల భారం పడితే.. ఉచితంగా వచ్చే ఇంటర్నెట్ టీవీ ఛానళ్లకు కూడా నెలకు ఎంతోకొంత రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
దేశంలో కొద్ది సంవత్సరాల్లోనే కోట్లాది స్మార్ట్ టీవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భారీ మార్కెట్‌ను నియంత్రించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. చట్టాలు మారితే ఉచిత వినోదానికి గండిపడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ట్రాయ్ తీసుకోబోయే నిర్ణయాలు భారతదేశంలో ఇంటర్నెట్ టీవీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయనున్నాయి.
Also Read: ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!