Galaxy Watch Orange Dot: స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే స్మార్ట్‌వాచ్‌ల స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది. అందుకే స్క్రీన్‌పై కనిపించే ప్రతి చిన్న గుర్తుకూ ఓ అర్థం ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లో నోటిఫికేషన్లను సూచించేందుకు వివిధ రంగులు, చిన్న చిన్న ఇండికేటర్లను ఉపయోగిస్తారు. వాటిలో తరచుగా కనిపించేది ఆరెంజ్ డాట్. గెలాక్సీ వాచ్ స్క్రీన్‌కు ఎడమ వైపున ఈ చిన్న ఆరెంజ్ చుక్క కనిపిస్తే.. మీ వాచ్‌లో ఇంకా చదవని నోటిఫికేషన్లు ఉన్నాయని అర్థం. ఫోన్‌కు మెసేజ్‌లు, కాల్స్ లేదా ఇతర యాప్‌ల నుంచి అలర్ట్‌లు వచ్చినప్పుడు ఇది కనిపిస్తుంది. ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా వాటి సంఖ్యను చూపించకుండా ఒకే ఆరెంజ్ డాట్ కనిపిస్తుంది. మీరు వచ్చిన నోటిఫికేషన్లన్నింటినీ చూసే వరకు ఈ డాట్ డిస్‌ప్లేపై కనిపిస్తూనే ఉంటుంది.
గెలాక్సీ వాచ్ స్క్రీన్‌ను కుడి వైపుకు స్వైప్ చేస్తే చాలు.. మీకు వచ్చిన మెసేజ్‌లు లేదా అలర్ట్‌లు అన్నీ వరుసగా కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు ఈ ఆరెంజ్ డాట్ ఎరుపు రంగులోకి మారుతుంది. అలా ఎరుపు రంగులోకి మారింది అంటే.. మీకు ఏదైనా అత్యవసరమైన లేదా ముఖ్యమైన నోటిఫికేషన్ వచ్చిందని అర్థం. అప్పుడు మీరు వెంటనే స్క్రీన్ స్వైప్ చేసి ఆ మెసేజ్ ఏంటో చూడటం మంచిది. శాంసంగ్ పాత వాచ్ మోడల్స్ నుంచి కొత్తగా వచ్చే మోడల్స్ వరకు ఈ నోటిఫికేషన్ సిస్టమ్‌ను దాదాపు ఒకేలా అందిస్తోంది. కాబట్టి మీరు పాత వాచ్ నుండి కొత్త మోడల్‌కి మారినా కూడా సెట్టింగ్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.
Also Read: వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?
ఈ ఆరెంజ్ డాట్ ప్రతీసారి స్క్రీన్ మీద కనిపించడం కొంతమందికి చిరాకు తెప్పిస్తుంది. మీ వాచ్‌కి ఎక్కువ నోటిఫికేషన్‌లు వస్తుంటే.. ఈ చుక్క పదే పదే కనిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఆరెంజ్ డాట్ నచ్చకపోతే దీన్ని పూర్తిగా తీసేయొచ్చు. దీని కోసం మీ వాచ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, డిస్‌ప్లే ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ నోటిఫికేషన్ ఇండకేటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీ వాచ్ స్క్రీన్ పై ఆరెంజ్ లేదా రెడ్ డాట్ కనిపించదు.
ఫోన్ ద్వారా కూడా ఈ సెట్టింగ్స్ చాలా సులభంగా మార్చుకోవచ్చు. దీని కోసం మీ ఫోన్‌లోని గెలాక్సీ వేరబుల్ యాప్ ఓపెన్ చేసి, వాచ్ సెట్టింగ్స్‌కి వెళ్లాలి. అక్కడ నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేసి, అడ్వాన్స్‌డ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే నోటిఫికేషన్ ఇండకేటర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆఫ్ చేస్తే చాలు. అయితే ఈ ఫీచర్ ఆఫ్ చేస్తే.. మీరు స్వైప్ చేసి చూసే వరకు నోటిఫికేషన్లు వచ్చాయో లేదో తెలియదు. అలా కాకుండా వాచ్ ఫేస్ బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవడం ద్వారా కూడా ఈ ఆరెంజ్ డాట్‌ను దాచేస్తూ, కేవలం రెడ్ డాట్ మాత్రమే కనిపించేలా సరికొత్తగా సెట్ చేసుకోవచ్చు.
Also Read: Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!