Sunil Gavaskar: భారత క్రికెట్ తొలి సూపర్ స్టార్ సునీల్ మనోహర్ గవాస్కర్ గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్ లోని నాటి, నేటితరం అభిమానులకు ఈయన సుపరిచితుడు. ముంబై నుండి అంతర్జాతీయ క్రికెట్ లోకి దూసుకు వచ్చిన దిగ్గజాలలో సునీల్ గవాస్కర్ ఒకరు. భారత ఓపెనర్ గా జట్టుకు ఎన్నో సేవలు అందించారు గవాస్కర్. విశ్వవిద్యాలయ క్రికెట్ నుండి జాతీయ క్రికెట్ లోకి దోసుకువచ్చిన గవాస్కార్ 1971 కరేబియన్ టూర్ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
Also Read: PAK on Cricket Stadiums: 1280 కోట్లు బొక్క… రెండు మ్యాచ్ లకే పాకిస్తాన్ ఎలిమినేట్ ?
వెస్టిండీస్ తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ద్వారా 1971 మార్చి 6న అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు సునీల్ గవాస్కర్. ఇక టెస్టుల్లో పదివేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గవాస్కర్ మాత్రమే. అంతేకాకుండా తన కెరీర్లో 125 టెస్టులు ఆడి 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సాధించాడు. తన అసాధారణ ప్రతిభతో ప్రపంచంలోనే మేటి ఫాస్ట్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. అలాగే 1983లో వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సునీల్ గవాస్కర్ సభ్యుడు కూడా.
ఇక సునీల్ గవాస్కర్ భారత్ తరపున 108 వన్డేలలో 3092 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా వన్డేల్లో సెంచరీ సాధించిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన గవాస్కర్.. వ్యాఖ్యాతగా క్రికెట్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ వ్యాఖ్యాతలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గవాస్కర్ ఓ ప్లేయర్, వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ తన పెద్దమనసును చాటుకున్నాడు.
దాదాపు 200 మంది బాలల ప్రాణాలకు అండగా నిలిచాడు. హుద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్నహస్తం అందిస్తూ వస్తున్నాడు. పుట్టుకతో చిన్నారులకు వచ్చే గుండె సంబంధిత లోపాలు, వ్యాధుల చికిత్సకు తన వంతుగా సహాయం అందిస్తూ వస్తున్నాడు. బెంగుళూరు లోని శ్రీ సాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా గవాస్కర్ ఈ సేవలు అందిస్తున్నాడు. అయితే భారత దిగ్గజ బ్యాట్స్మెన్ అయిన సునీల్ గవాస్కర్.. తన కాలంలో అత్యంత భయంకరమైన బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు కూడా హెల్మెట్ ధరించేవారు కాదు.
అయితే తాజాగా తాను హెల్మెట్ ని ధరించకపోవడానికి గల విషయాన్ని వివరించారు సునీల్ గవాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” మా కాలంలో నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన ఏడు, ఎనిమిది సంవత్సరాల వరకు హెల్మెట్లు అందుబాటులోకి రాలేదు. అప్పుడు మేము జేబుల్లో ఫేస్ టవల్స్ పెట్టుకొని, థై ప్యాడ్స్ లాగా యూజ్ చేసేవాళ్లం. మా కాలంలో ఇప్పుడు ఉన్న పరికరాలు ఏవి ఉండేవి కావు. అలాంటప్పుడు కొత్తగా వీటి గురించి ఎందుకు ఆలోచిస్తాం. అందుకే హెల్మెట్ గురించి పట్టించుకోలేదు” అని చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.