Rohit Sharma: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కేవలం ఒక్క రంగానికే పరిమితం కావడం లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా వారి వృత్తితోపాటు ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తున్నారు. ముఖ్యంగా క్రికెటర్లు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇందులో ముందుంటారని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో వీరు ఇలా ఇతర రంగాలలో పెట్టుబడును పెట్టడం ఎక్కువైంది.
Also Read: Afghan Fans Warns India: ఫైనల్‌లో భారత్‌ను చిత్తు చిత్తు చేస్తాం..అఫ్గాన్ ఫ్యాన్స్ వార్నింగ్
ఇక స్టార్ క్రికెటర్లు క్రికెట్ ఆడుతుండడంతో పాటు ఇతర వాణిజ్య ప్రకటనలు, ఐపీఎల్ లో వారికి లభించిన పారితోషికాన్ని స్టాక్ మార్కెట్, స్టార్టప్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా రూపాలలో పెట్టబడును పెడుతున్నారు. ఇక క్రికెటర్లు తమ లగ్జరీ ఇల్లు, అపార్ట్మెంట్లను అద్దెకు ఇవ్వడం సాధారణమే. తాజాగా స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబైలోని లోయర్ పరేల్ లో ఉన్న తన ప్రాపర్టీని అద్దెకు ఇచ్చాడు. పలు నివేదికల ప్రకారం రోహిత్ శర్మ ముంబైలోని తన లగ్జరీ అపార్ట్మెంట్ ని నెలకు రూ. 2.6 లక్షలకు అద్దెకు ఇచ్చాడు.
2013లో రోహిత్ శర్మ, తన తండ్రి గురునాథ్ శర్మ కలిసి ఈ ఆస్తిని రూ. 5.46 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ వల్ల నెలకి 2.6 లక్షలు సంపాదిస్తున్నాడు. రోహిత్ శర్మకు చెందిన ఈ అపార్ట్మెంట్ ముంబైలోని లోథా మార్కైస్ లో ఉంది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మొత్తం ఏరియాలో రోహిత్ శర్మ అపార్ట్మెంట్ 1298 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, రెండు పార్కింగ్ స్పేస్ లతో ఉంది. ఈ స్థలంలో ఉన్న బిల్డింగ్ లో రోహిత్ శర్మ తండ్రికి మరో అపార్ట్మెంట్ కూడా ఉంది.
దీనిని గత సంవత్సరం రూ. 2.65 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఈ స్థలం బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారీమన్ పాయింట్ వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇలా రోహిత్ శర్మ మైదానంలో మాత్రమే కాకుండా వ్యాపారంగానూ తన నిర్ణయాలతో చురుకుగా ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పెట్టుబడులు క్రికెట్ అనంతరం కూడా అతడికి ఆర్థిక భద్రతను అందిస్తాయి.
ఇక క్రికెట్ విషయానికి వస్తే ప్రస్తుతం రోహిత్ శర్మ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రస్తుతం దుబాయిలో ఉన్నాడు రోహిత్ శర్మ. అతడి కెప్టెన్సీలో టీమిండియా లీగ్ స్టేజ్ లో ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించి సెమిస్ చేరింది. అయితే ఈ టోర్నీలో రోహిత్ శర్మ బ్యాట్ తో ఇప్పటివరకు పెద్ద ఇన్నింగ్స్ మాత్రం ఆడలేదు. ఇక భారత జట్టు తన తర్వాత మ్యాచ్ ను మార్చి రెండవ తేదీన న్యూజిలాండ్ తో ఆడబోతోంది.