Pujara on Ashwin: గిల్ నేతృత్వంలోని యువ జట్టు ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా టెస్ట్ సిరీస్ ని 2 – 2 తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ సందర్భంలో భారత జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. మొదటి టెస్ట్, లార్డ్స్ టెస్ట్ లో ఓటమి ఎదురవ్వడంతో టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై వేటు పడుతుందని వార్తలు వినిపించాయి. ఈ పర్యటనలో సిరీస్ ని కోల్పోయే ప్రమాదం భారత జట్టుపై పొంచి ఉందని.. గంభీర్ నాయకత్వంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో భారత్ కొన్ని కీలక విజయాలు సాధించినప్పటికీ.. టెస్ట్ ఫార్మాట్ లో నిరంతర వైఫల్యాలు అతని కోచింగ్ పదవీకాలం పై ప్రశ్నార్ధకంగా మారాయి.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ లో ఈ సిరీస్ ని భారత్ ఓడిపోతే.. బీసీసీఐ గంభీర్ భవిష్యత్తును పునరాలోచించే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కానీ మాంచెస్టర్ టెస్ట్ డ్రా, ఓవల్ టెస్ట్ లో విజయం సాధించడంతో గిల్ సేన సిరీస్ ని సమం చేసింది. ఈ క్రమంలో టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? అనే ప్రశ్నకు కాస్త బ్రేక్ పడింది. అయితే తాజాగా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా మాత్రం టీమిండియా హెడ్ కోచ్ గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక కాబోతున్నాడని అంటున్నాడు. అశ్విన్ కి ఒక కోచ్ కి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని.. అతడు త్వరలోనే కోచ్ అవుతాడనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా పూజారా మాట్లాడుతూ..” రవిచంద్రన్ అశ్విన్ ఓ లెజెండరీ ప్లేయర్. అతడు ఆడిన 3 ఫార్మాట్లలో తన బ్యాట్ తో, బంతితో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేవాడు. అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న అశ్విన్ భారత జట్టుకు ఏదో ఒక రోజు హెడ్ కోచ్ అవుతాడు. ఆల్ రౌండర్ అయిన అశ్విన్ కి ఒక కోచ్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? అనే ప్రశ్నకు నా సమాధానం రవిచంద్రన్ అశ్విన్. ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదు”. అని చెప్పుకొచ్చాడు పూజారా.
అలాగే ఈ ఇంటర్వ్యూలో నిర్వహించిన రాపిడ్ ఫైర్ లో చక చకా సమాధానాలు ఇచ్చాడు. ఇందులో మీరు ఏ భారత ఆటగాడితో ఒక రోజంతా గడపాలని అనుకుంటున్నారు అనగా..? విరాట్ కోహ్లీ అని సమాధానం ఇచ్చాడు. అలాగే మీతో ఆడిన వాళ్లలో ఎవరు రియాల్టీ షో ప్రారంభించాలని భావిస్తున్నారు..? శిఖర్ ధావన్, టీమిండియా హెడ్ కోచ్ అయ్యే మీ టీమ్ మేట్ ఎవరు..? రవిచంద్రన్ అశ్విన్. టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్ కి హాజరు అయ్యే సహచరుడు ఎవరు..? కేఎల్ రాహుల్. అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టే క్రికెటర్ ఎవరు..? విరాట్ కోహ్లీ. రోజంతా క్రికెట్ గురించి చర్చించే ఆటగాడు ఎవరు..? రవిచంద్రన్ అశ్విన్. ఎప్పుడు ఫోన్ లో వీడియోలు చూసేది ఎవరు..? రిషబ్ పంత్. బ్యాట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది ఎవరు..? సచిన్ టెండుల్కర్.
Also Read: Dhoni Fan Died: ఐపీఎల్ 2026 కంటే ముందే CSK జట్టులో పెను విషాదం!
జుట్టుకు రంగేసుకునే ప్లేయర్ ఎవరు..? ఎమ్మెస్ ధోని. సహచరులకు బెస్ట్ గిఫ్టులు ఇచ్చే క్రికెటర్ ఎవరు..? రాహుల్ ద్రవిడ్.. అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి ఆకస్మాత్తుగా వీడ్కోలు పలికి అందరినీ షాక్ కి గురిచేశాడు. కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో 2024 డిసెంబర్ లో వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే గబ్బా టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. నిజానికి ఇప్పట్లో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెబుతాడని అభిమానులు ఊహించలేదు. అలా అనుకునేందుకు పెద్దగా కారణాలు కూడా కనిపించలేదు. కానీ అనూహ్యంగా అశ్విన్ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్ట్ లకు అశ్విన్ అందుబాటులో ఉండలేదు. ఇక ప్రస్తుతం అశ్విన్ ఐపీఎల్, తమిళనాడు టీ-20 లీగ్ వంటి టోర్నీలో ఆడుతున్నాడు. అశ్విన్ 3 ఫార్మాట్లలో మొత్తంగా 765 వికెట్లు పడగొట్టాడు. ఇందులో టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టాడు.