Wpl 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ {డబ్ల్యూపిఎల్} మూడవ సీజన్ 14వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. శనివారం రోజు జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన ఆర్సిబి పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆర్సిబి వరుసగా నాలుగవ ఓటమిని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్ బెర్త్ ని ఖరారు చేసుకుని టేబుల్ టాపర్గా నిలిచింది.
Also Read: Inzamam on IPL: IPL పై పాకిస్థాన్ కుట్రలు… బాయ్‌కాట్ చేయాలంటూ ?
ఇక ఓటమితో ఆర్సిబి తన ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆర్సిబి బ్యాటర్లలో ఎల్లిస్ పెర్రి 60 హాఫ్ సెంచరీ తో రాణించగా.. రఘ్వి బిస్త్ 33, కెప్టెన్ స్మృతి మందాన 8, రీచా గోష్ 5, కనిక అహుజా 2 పరుగులతో నిరాశపరిచారు. ఇక ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సేన్ 2, శ్రీ చరణి 2, మరిజన్నే కాప్ 1 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదట ఆచితూచి ఆడింది.
ముఖ్యంగా కెప్టెన్ లానింగ్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. 12 బంతులలో ఆమె కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. ఆ దశలో ఓపెనర్ షెఫాలి వర్మకు జత కలిసిన జెస్ జోనాసన్.. ఆర్సిబి బౌలర్ల పై విరుచుకుపడ్డారు. షెఫాలి వర్మ {80*}, జెస్ జోనాస్సెన్ {61*} పరుగులతో చెలరేగడంతో ఢిల్లీ 15.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 1501 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఆర్సిబి బౌలర్లలో రేణుక సింగ్ ఆ ఏకైక వికెట్ తీసింది. ఇక మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
Also Read: Saqlain Mushtaq: మగాళ్లైతే పాకిస్థాన్ వచ్చి ఆడండి..టీమిండియాకు సవాల్ ?
ఈ టోర్నీలో ఏడు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ.. ఐదు విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక ఢిల్లీ తన చివరి లీగ్ మ్యాచ్ గుజరాత్ తో ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచినా, ఓడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే గత రెండు సీజన్లలో ఫైనల్ లో ఓడిన ఢిల్లీ.. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వదలకూడదనే పట్టుదలతో ఉంది. ఇక ఈ 14వ మ్యాచ్ పూర్తయిన వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ పది పాయింట్లు అగ్రస్థానంలో నిలిచింది.
ముంబై జట్టు ఆరు పాయింట్లతో రెండవ స్థానం, యూపీ వారియర్స్ నాలుగు పాయింట్లతో మూడో స్థానం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ జెయింట్స్ నాలుగు పాయింట్లతో అయిదవ స్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుతం ఆర్సిబి చివరి రెండు లీగ్ మ్యాచ్లలో గెలిచినా.. ప్లే ఆఫ్స్ కి చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది. ఇక టేబుల్ టాపర్ నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాలలో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.