హైదరాబాద్ సన్ రైజర్స్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అలా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు ఆడి 200 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ క్రమంలో 7 వికెట్లు నష్టపోయింది.
వివరాల్లోకి వెళితే 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ కి ఆదిలోనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. భువనేశ్వర్ కుమార్ బౌలింగులో ఓపెనర్ జాస్ బట్లర్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన కెప్టెన్, టీ 20 ప్రపంచకప్ నకు ఎంపికైన సంజు శాంసన్ వచ్చి మూడు బాల్స్ ఆడి డక్ అవుట్ అయ్యాడు. అంతే 1 పరుగుకి 2 వికెట్లతో జట్టు గిలగిల్లాడింది.
ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్ ఇద్దరూ ఆదుకున్నారు. అదీ అలా ఇలా కాదు. యశస్వి 40 బంతుల్లో 2 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. ఇక రియాన్ పరాగ్ కూడా 49 బంతుల్లో 4 సిక్స్ లు ,7 ఫోర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కి 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 13.3 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 135 పరుగులతో రాజస్థాన్ మళ్లీ పటిష్టస్థితికి వెళ్లిపోయింది.
కానీ తర్వాత వచ్చినవాళ్లు తొందరపడి హిట్టింగ్ చేస్తూ హడావుడిలో వికెట్లు పారేసుకుని, మ్యాచ్ ని చేజేతులారా పోగొట్టుకున్నారు. హెట్ మెయిర్ (13), రోవ్ మన్ పోవెల్ (27), ధ్రువ్ జురెల్ (1) ఇలా ఆడారు. దాంతో చివరి బాల్ కి రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో పోవెల్ ఎల్బీ డబ్ల్యూ అయిపోయాడు. దీంతో ఒక పరుగు తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.
హైదరాబాద్ బౌలింగులో భువనేశ్వర్ 3, కమిన్స్ 2, నటరాజన్ 2 వికెట్లు తీశారు.
Also Read: SRH vs RR Match Highlights : హైదరాబాద్ మ్యాచ్ లో.. వింతలు-విశేషాలు
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ కి ఆదిలోనే దెబ్బతగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (12) త్వరగా అవుట్ అయిపోయాడు. అయితే మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈసారి క్లిక్ అయ్యాడు. 44 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ (5) అయిపోయాడు.
తర్వాత వచ్చిన విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బాధ్యత తీసుకుని ఇరగదీశాడు. 42 బంతుల్లో 8 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇకపోతే హెన్రిచ్ క్లాసెన్ మాత్రం 19 బంతుల్లోనే 3 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి
తనూ నాటౌట్ గా ఉన్నాడు. మొత్తానికి హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
Also Read: RCB vs GT Match Preview: ఆర్సీబీ మళ్లీ పంజా విసురుతుందా..? నేడు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్..
ఒక దశలో 14.4 ఓవర్లలో 3 వికెట్లనష్టానికి 131 పరుగుల మీదున్న హైద్రాబాద్ భారీ స్కోరు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ రాజస్థాన్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగు చేయడంతో 201 దగ్గర ఆగారు.
రాజస్థాన్ బౌలింగులో ఆవేశ్ ఖాన్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీసుకున్నారు. ఇక టీ 20 ప్రపంచకప్ నకు ఎంపికైన యజ్వేంద్ర చాహల్ ఒక్క వికెట్ తీయకపోగా 4 ఓవర్లలో ఏకంగా 62 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడిది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఈ గెలుపుతో హైదరాబాద్ సన్ రైజర్స్ టాప్ 4 లో నిలవగా, రాజస్థాన్ మాత్రం అలాగే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది.