Land Disputes: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎంత దోచుకున్నారంటూ ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆస్తుల చిట్టాలు బయటపెట్టుకుంటుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.., మాజీ మంత్రి కేటీఆర్ ఆస్తుల చిట్టా విప్పితే.., కేటీఆర్ వర్గం సీఎం కుటుంబసభ్యుల ఆస్తుల చిట్టా బయటపెట్టిందన్నారు. వాళ్ళు ఇలా బయటపెట్టింది కేవలం 1 శాతం దోపిడీ మాత్రమేనని ఏలేటి వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన దోపిడీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రూ.లక్షల కోట్ల భూదోపిడీపై బీజేపీ ఆది నుంచి రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, విప్‌లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలపైకి దూసుకొచ్చి అడ్డుకున్నా, మైకులు కట్ చేసినా, చివరకు సభను వాయిదా వేసే పరిస్థితి తెచ్చినా సరే బీజేపీ ప్రజాపక్షాన గళమెత్తి వాస్తవాలను బయటపెట్టిందని గుర్తుచేశారు. ప్రోహిబిటెడ్ లిస్ట్ 22ఏ, ధరణి, భూభారతి పేర్లతో గత, ప్రస్తుత ప్రభుత్వాలు సాగించిన భూదోపిడీ కుంభకోణాలను అసెంబ్లీలో ఆధారాలతో సహా నిలదీయడంతోనే చివరకు సీఎం, మంత్రులు సమాధానం చెప్పుకోలేక చేతులెత్తేశారని ఆయన విమర్శించారు.
ధరణిపై చేపట్టిన ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు తొక్కిపెట్టిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాపాలను కప్పిపుచ్చుతూ, చీకటి ఒప్పందాలు, లోపాయికారీ అవగాహనలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. రాష్టత్ర ప్రభుత్వం.. చిన్న చిన్న మెమోలు జారీ చేస్తూ.. 22ఏ నిషేధిత జాబితా నుంచి కొన్ని కాలనీలను, భూములను బయటకు తీశామని, రిజిస్ట్రేషన్ల వెసులుబాటు కల్పించామని ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. నాలుగు కాలనీలకు మెమోలిచ్చి సమస్య పరిష్కారమైందని చేతులు దులుపుకుంటే సరిపోదని, లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు అన్యాక్రాంతమైన ఈ సమగ్ర వ్యవహారంలో బాధితులకు శాశ్వత న్యాయం జరగాలంటే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల భూకుంభకోణాలపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
Also read: సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!
అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని, ప్రైవేట్ బాధితులకు పూర్తి స్థాయిలో భూములను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో భూమాఫియా విచ్చలవిడిగా బరితెగించిందని, రెండు రోజుల క్రితం కూకట్‌పల్లి సర్వే నంబర్ 1007లో రూ.50 వేల కోట్ల విలువైన భూమిని కాజేయడానికి అధికార పార్టీ బినామీ కంపెనీ ప్రహరీ గోడ కట్టే దుస్సాహసానికి ఒడిగట్టిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అక్కడ 1961లో ఏర్పాటైన ఒక సొసైటీకి చెందిన భూముల్లోని 1400 కుటుంబాల ప్లాట్లను, వారి కాంపౌండ్ వాల్స్‌ను జేసీబీలతో దౌర్జన్యంగా కూలగొట్టారని మండిపడ్డారు. ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి స్వయంగా తాము ఘటనా స్థలానికి వెళ్లి బాధితుల గోడు విన్నామని తెలిపారు. ప్రభుత్వంతో సంబంధం లేని లీగల్ ప్రైవేట్ ఆస్తులను సైతం అధికార పార్టీ బినామీ కంపెనీలు కబ్జా చేస్తుంటే రాష్ట్రంలో ఎంతటి అరాచక పాలన నడుస్తోందో స్పష్టమవుతోందని ఏలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన పెద్దలు.. ఇప్పుడు ప్రైవేట్ స్థలాలను సైతం ల్యాండ్ హెయిస్ట్ వెబ్ సిరీస్ తరహాలో గద్దల్లా తన్నుకుపోతున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ, ప్రైవేట్ భూముల దోపిడీపై నిత్యం బాధితుల నుంచి వందలాది ఫోన్ కాల్స్, పక్కా ఆధారాలు బీజేపీకి అందుతున్నాయని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల భూకుంభకోణాలపై దాదాపు 200 కేస్ స్టడీలను సేకరించి, పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేశామని తెలిపారు. అసెంబ్లీలో బీజేపీ మైకులు కట్ చేసి గొంతు నొక్కారని, కానీ, ప్రజాక్షేత్రంలో వీరి దోపిడీని ఆధారాలతో ఎండగట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తొలి విడతగా 10-15 కీలక కేస్ స్టడీలను, డాక్యుమెంటరీ ఆధారాలను బట్టబయలు చేస్తామని ఏలేటి స్పష్టంచేశారు. అనంతరం రెండో విడత పీపీటీని కూడా విడుదల చేస్తామని తెలిపారు. 22ఏ, ధరణి, భూభారతి ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టారో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తామని, అదే వేదికగా ఈ భూదోపిడీపై బీజేపీ చేపట్టబోయే భవిష్యత్ ప్రజా పోరాట కార్యాచరణను కూడా వెల్లడిస్తామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
Also read: వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!