Ambedkar University: స్వేచ్చ బ్యూరో: విద్యారంగంలో సమానత్వం, మహిళా సాధికారతకు అద్దం పట్టేలా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం జరగనుంది. అక్టోబర్ 7న నిర్వహించనున్న అబేద్కర్ వర్సిటీ వెంకట్రామ్ ఆడిటోరియంలో జరగే ఈ వేడుకలో మొత్తం 36,145 మంది విద్యార్థులు డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్లు కోర్సుల్లో పట్టాలు అందుకోనుండగా, 38 మంది ప్రతిభావంతులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు. వీరిలో 29 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉండటం విశేషం. మరోవైపు 11 మంది ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు సైతం పట్టాలు అందుకోనున్నారు. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ స్నాతకోత్సవంలో చిత్ర నిర్మాత, రచయిత బీ నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. మొత్తం 36,145 మంది అభ్యర్థులు డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్లు అందుకోనున్నారు. కాగా అందులో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో 17,960 మంది, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌లో 18,185 మంది విద్యార్థులు పట్టా అందుకోనున్నారు.
36,145 మందిలో 19,800 మంది మహిళా విద్యార్థులు డిగ్రీలు అందుకుంటున్నారు. 16,334 మంది పురుష విద్యార్థులు డిగ్రీలు అందుకుంటున్నారు. ఆర్మీకి చెందిన 43 మంది సిబ్బంది(యూజీ-4, పీజీ-39) పట్టభద్రులవుతున్నారు. ఈ 43 మందిలో పురుషులు-37, మహిళలు-ఆరుగురు ఉన్నారు. ఇదిలాఉండగా ఈసారి 11 మంది ట్రాన్స్‌జెండర్లు తమ డిగ్రీలను అందుకుంటున్నారు. కాగా 23 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్ డీ, ఒకరికి ఎంఫిల్ డిగ్రీ ప్రదానం చేయనున్నారు. మొత్తంగా 38 మందికి బంగారు పతకాలు దక్కనుండగా(యూజీలో 16, పీజీలో 22) అందులో మహిళలు 29, పురుషులు 9 మందికి మెడల్స్ లభించనున్నాయి. ఈ ఏడాది స్నాతకోత్సవ ప్రత్యేకత ఏమిటంటే 26 మంది పురుష ఖైదీలు, ఒక మహిళా ఖైదీతో సహా మొత్తం 27 మంది(చెర్లపల్లి సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైలు నుంచి) డిగ్రీలు అందుకుంటున్నారు. అందులో యూజీ 12 మంది, పీజీ 15 మంది ఉన్నారు. కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందిన ఒక ఖైదీ ఒకే ప్రయత్నంలో అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై బంగారు పతకం, బుక్ ప్రైజ్ సాధించడం విశేషం.
గత 45 ఏళ్లలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సుమారు 6,27,175 డిగ్రీలు ప్రదానం చేశారు. యూజీ ప్రోగ్రామ్స్ లో ఒకటి కంటే ఎక్కువ బంగారు పతకాలు పొందినవారిలో బొజ్జనపల్లి ఆశ్రిత మూడు పతకాలతో ముందు వరుసలో ఉన్నారు. కడియాల సాయిభానుకు రెండు బంగారు పతకాలు, హజీరా బేగంకు రెండు పతకాలు, శివ పార్వతి చిప్పలకు రెండు బంగారు పతకాలు, నుకపెయ్యి సురేష్ అనే ఖైదీ ఒక బంగారు పతకం, బుక్ ప్రైజ్ సాధించారు. ఇదిలాఉండగా పీజీ ప్రోగ్రామ్స్ లో ఒకటి కంటే ఎక్కువ బంగారు పతకాలు పొందినవారిలో మంతెన శ్రీదేవికి రెండు బంగారు పతకాలు, తోట శ్వేతకు రెండు పతకాలు దక్కాయి.
Also read: నామినేటెడ్ పదవుల ఎంపికలో సీఎం రేవంత్ సంచలనం.. వారికే పెద్దపేట?
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఓడీఎల్ విధానంలో 8 కొత్త ప్రోగ్రామ్స్, ఆన్‌లైన్ విధానంలో 5 కొత్త ప్రోగ్రామ్స్ ప్రవేశపెడుతున్నారు. కొత్త ప్రోగ్రామ్స్ లో భాగంగా ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంస్సీ డేటా సైన్స్, ఎంస్సీ స్టాటిస్టిక్స్, ఎంస్సీ జాగ్రఫీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్(స్కూల్ అడ్మినిస్ట్రేషన్) ఉన్నాయి. కొత్తగా అనుమతి పొందిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ లో ఎంఏ తెలుగు, ఎంకామ్, ఎంబీఏ జనరల్, బీకామ్(ఇంగ్లిష్, తెలుగు మీడియం) ఉన్నాయి. ఇదిలాఉండగా విద్యార్థులకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు విశ్వవిద్యాలయం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
విశ్వవిద్యాలయం సమాన అవకాశాల ప్రణాళికలో భాగంగా ఆదివాసీ యువత, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచిత విద్యను అందిస్తోంది. గోండ్, కోయ, చెంచు తదితర వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్యను అందిస్తోంది. ఇదిలాఉండగా విదేశీ భాషల్లో(ఇంగ్లిష్, జర్మన్, కొరియన్, ఫ్రెంచ్) శిక్షణ కోసం ఐజీఎన్ఐటీయూఎస్ ఎడ్యు టెక్ సహకారంతో లాంగ్వేజ్ లెర్నర్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించేలా ప్రణాళిక చేస్తున్నారు. వర్సిటీలో కొత్త మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.10 కోట్లతో సమగ్ర అభ్యాస కేంద్రం భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ.12 కోట్లతో సెంట్రలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ ల్యాబ్, డిజిటల్ రిసోర్స్ సెంటర్ కొత్త భవనం పనులు చేపట్టనున్నారు.
Also read: Noise నుంచి అదిరిపోయే హోమ్ థియేటర్ సౌండ్‌బార్లు.. ధర రూ.4,999 నుంచే!