Youth Leadership: స్వేచ్చ బ్యూరో: ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్ చైర్మన్లు వంటి తదితర పదవుల కొరకు అభ్యర్ధులను ఎంపిక చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్నది.ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో యూత్ కు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా యువతకు ఛాన్స్ ఇస్తూ సీఎం పార్టీ పటిష్టతను పెంపొందిస్తున్నారు. గడిచిన రెండున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనలో వచ్చిన నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానం భర్తీని పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతున్న ది. వాస్తవంగా రాజకీయాల్లో అధికారం నిలకడగా ఉండాలంటే, పార్టీకి సుదీర్ఘకాలం పనిచేసే బలమైన లీడర్లతో పాటు క్షేత్రస్థాయిలో టీమ్ కూడా అవసరం.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఒక వైపు సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పిస్తూనే , పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న యువతకు పదవులు రావడానికి తోడ్పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా బల్మూరి వెంకట్, అనిల్ కుమార్ యాదవ్ నుంచి తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్ధులు సామా రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. పార్టీ పెద్దలు, మంత్రుల నుంచి కూడా సీఎంకు ప్రెజర్ వచ్చినా.. యువతకు ఛాన్స్ కల్పించాలనే ఉద్దేశ్యంతో సీఎం తన నిర్ణయాల్లో మార్పులు చేయడం లేదు. పైగా స్వయంగా తానే మానిటరింగ్ చేస్తూ ఆయా అభ్యర్ధుల విజయానికి తోడ్పడటం గమనార్హం.
Also Read: ఫ్లై దుబాయి విమానంలో ఏం జరిగింది? ఘటన తర్వాత, విమానంలో చికిత్స చేసిన ఓ డెంటిస్ట్
పనితీరు ఆధారంగానే పదవులు కల్పించే దిశగా సీఎం నిర్ణయాలు కనబడుతున్నాయి. విద్యార్థి, యువజన పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక పార్టీ కష్టకాలంలో గళం విప్పి, గత ప్రభుత్వంపై సుదీర్ఘంగా ఫైట్ చేసినందుకు అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ, అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ కు ఛాన్స్ ఇచ్చారు. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లో ఉంటూ అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసిన మెట్టు సాయికుమార్, ప్రీతమ్, పహీమ్, చరణ్ కౌశిక్, ముత్తినేని వీరయ్య, పయిమ్ ఖురేషీ తదితర యువ లీడర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ చైర్మన్లుగా సీఎం ఎంపిక చేశారు.సాధారణంగా పదవులొస్తే కాంగ్రెస్ లో సీనియర్ల మధ్య కాంపిటేషన్ నెలకొనడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ దఫా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందుకు భిన్నంగా పదవులు కేటాయింపు జరగడం విశేషం.
యువ నేతలకు ఇప్పుడు పదవులు ఇస్తే వారు కనీసం 10 నుండి 15 ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉంటారు.అంతేగాక కష్టపడి పనిచేస్తే గుర్తింపు తప్పక లభిస్తుందనే నమ్మకాన్ని ఈ నిర్ణయాలు సాధారణ కార్యకర్తల్లో కలిగిస్తాయి. ఇదే నేపథ్యంలో సీఎం ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. రెండున్నరేళ్ల పాలన పూర్తవుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రతి అడుగు రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలతో పాటు, ఆ తర్వాతి పదేళ్ల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే అంటూ పార్టీలో డిస్కషన్ జరుగుతుంది. ‘పదేళ్ల పవర్ లైన్’ వ్యూహంతో కాంగ్రెస్‌ను కొత్త ఉత్సాహంతో పరుగులు తీర్పించడమే సీఎం రేవంత్ రెడ్డి అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.
Also read: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే అస్సలు తినలేరు!