Bhatti Vikramarka : ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన ఖర్చు వివరాలను ప్రతి నెల రోజులకు ఒకసారి వెల్లడించాలని అధికారులను ఆదేశించారు.
అందుబాటులో ఉన్న నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని అధికారులకు సూచించిన భట్టి విక్రమార్క.. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం చేస్తున్న వ్యయం ఆయా వర్గాల్లో ఆదాయం పెరిగేలా, ఆస్తులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ఉండాలన్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికల్ని రూపొందించాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ నెల 23న నిర్వహించబోయే సమావేశానికి రావాలని అధికారులకు సూచించారు.
సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు.. రాబోయే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆయా శాఖ అధికారులను ప్రశ్నించారు. బడ్జెటేతర నిధులు ఖర్చు చేసే సమయంలోనూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం జనాభా దామాషా లో నిధుల ఖర్చు జరిగిందా? లేదా? అనే సంపూర్ణ సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు సంబంధించి.. గత ఎనిమిదేళ్లుగా క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల్లో అధ్యయనం చేసిన సెస్ నివేదికలను అధికారులు ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన అధికారులు.. ఇప్పటి నుంచి సెస్ అధికారులు తమ నివేదికలను ఫైనాన్స్, ప్లానింగ్ శాఖ అధికారులకు అందజేసి వారితో తరచూ సమావేశం అవుతుండాలని ఆదేశించారు.
అటవీ భూముల్లో సోలార్ పవర్ ద్వారా మోటార్లు వినియోగించడం, ఆయా భూముల్లో వెదురు, అవకాడో, పామాయిల్ వంటి వాటితో పాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులు డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రయత్నం ద్వారా అడవులను సంరక్షించడంతో పాటు ఆదివాసి, గిరిజన రైతులకు ఆదాయాలు పెరుగుతాయన్నారు. మూసీ పునరుజ్జీనం కార్యక్రమంలో నిర్వాసితులు అవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారికి వడ్డీ లేని రుణాలు అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అందుబాటులోకి తీసుకు రావాలన్న భట్టి విక్రమార్క.. మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా వాహనాలు, క్లీనింగ్ యంత్రాలు ఆయా వర్గాలకు అందించాలని సూచించారు. ఇందిర జల ప్రభ, మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థిక చేయూతను అందించాలన్నారు.
Also Read : తొలిరోజు విదేశీ పర్యటనలోనే సీఎం రేవంత్ సూపర్ సక్సెస్..
ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.