Bhatti Vikramarka: ప్రజా భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్షాలపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యుత్ సేవలు, డిస్కమ్‌ల భవిష్యత్తు, యాదాద్రి పవర్ ప్లాంట్ లోపాలపై ఆయన పూర్తి వివరాలతో స్పందించారు.
అప్రమత్తంగా విద్యుత్ సరఫరా
సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పీక్ డిమాండ్‌కు చేరుకుందని భట్టి తెలిపారు. ఎంతటి డిమాండ్ ఉన్నా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ ఇస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. విద్యుత్ విభాగాన్ని ప్రోత్సహించాల్సింది పోయి, కొందరు నేతలు తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
డిస్కమ్‌ల ప్రైవేటీకరణపై స్పష్టత
కాంగ్రెస్ ప్రభుత్వం డిస్కమ్‌లను ప్రైవేటీకరిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి హరీష్ రావు గారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చకండి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడమే మా ప్రాధాన్యత’ అని స్పష్టం చేశారు.
యాదాద్రి పవర్ ప్లాంట్.. గత ప్రభుత్వ పాపమే
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ చేసిన పొరపాట్ల వల్లే నేడు వినియోగదారులపై రూ. 40,000 కోట్ల అదనపు భారం పడుతోందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. స్థలం ఎంపిక, సరైన DPR, చివరికి బొగ్గు నిల్వలు కూడా లేకుండా ప్లాంట్ ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. జి-9 గ్రేడ్ బొగ్గు లభ్యతను సరిచూసుకోకుండా ఒప్పందాలు చేసుకున్నారని, సింగరేణి అని చెప్పి ఆ తర్వాత ఇంపోర్టెడ్ బొగ్గు అంటూ మాట మార్చారని ఎద్దేవా చేశారు.
సింగరేణి ఆస్తుల రక్షణ
బీఆర్ఎస్ హయాంలో సింగరేణిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, కొత్త బొగ్గు గనుల తవ్వకాలను అడ్డుకున్నారని భట్టి విమర్శించారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిన ఒడిశాలోని ‘నైనీ కోల్ బ్లాక్’ వద్దకు తాను స్వయంగా వెళ్లి, అక్కడ ఉన్న చిక్కుముడులు విప్పి బొగ్గు సేకరణకు బాటలు వేశానని చెప్పారు. ఇప్పుడు అదే నైనీ నుంచి యాదాద్రికి బొగ్గును తరలిస్తున్నామని వెల్లడించారు.
వారానికి ఒక తప్పు..
బొగ్గు, నీటి సదుపాయాలు ఉన్న రామగుండం, పాల్వంచ వంటి ప్రాంతాల్లో ప్లాంట్లు పెడితే ఖర్చు తగ్గేదని, కానీ తప్పుడు అంచనాలతో యాదాద్రిని నిర్మించారని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన ఒక్కో తప్పును వారానికి ఒకటి చొప్పున బయటపెడతానని హెచ్చరించారు.
Also Read: ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సరిహద్దుల్లో 45 ఎకరాల మిస్సింగ్.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!