Telangana Elections: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడే వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రంలో ఎలాగైనా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కమలం పార్టీ అధిష్టానం, ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగంలోకి దిగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయం సాధించడమే లక్ష్యంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో తమకున్న నలుగురు లోక్‌సభ సభ్యులకు పూర్తి స్థాయి గెలుపు బాధ్యతలను కాషాయ పార్టీ అప్పగించింది. ట్రై కార్పొరేషన్ల పరిధిలో పార్టీని విజయతీరాలకు చేర్చే గురుతర బాధ్యతను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భుజాలపై పెట్టింది. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న డివిజన్లలో క్షేత్రస్థాయి క్యాడర్‌ను బలోపేతం చేస్తూ, సరైన అభ్యర్థులను రంగంలోకి దించేలా ఈ నలుగురు ఎంపీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగనున్నారు.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన సానుకూల ఫలితాలను ఈసారి మరింత మెరుగుపరుచుకుని, మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ భారీ వ్యూహాన్ని రచిస్తున్నారు. మరోవైపు, తెలంగాణలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి వరంగల్‌పై పట్టు సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి మైలేజ్ వస్తుందని అధిష్టానం నమ్ముతోంది. ఇందుకోసం బండి సంజయ్ వరంగల్‌లోనే పూర్తిస్థాయిలో ఉండి, క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం ఉంది. ఈ పరిణామానికి బలం చేకూరుస్తూ, ఇటీవల వరంగల్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో బండి సంజయ్ స్వయంగా ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. తానే స్వయంగా వరంగల్‌లో క్యాంప్ వేసి ఉండి, ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తానని ఆయన ప్రకటించారు. స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ, అధికార పార్టీ వ్యూహాలను తిప్పికొట్టి బీజేపీని గెలిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Also read: పదవులు ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గెలుపే నా లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయదుందుభి మోగించిది. మేయర్ స్థానాన్ని కొన్ని స్థానాల దూరంతో చేజార్చుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా మూడు కార్పొరేషన్లలో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకే ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఉన్న కేంద్ర మంత్రితో పాటు ముగ్గురు ఎంపీలను పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో కూడా గెలుపుపై కన్నేసిన కమలం పార్టీకి ఖమ్మం క్లిష్టతరంగా మారే అవకాశముంది. వరంగల్ లోనూ ఆశించిన స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే పార్టీ మాత్రం వరంగల్ పై ధీమాగా ఉంది.
ఎందుకంటే గతంలోనే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండు ఎంపీ సీట్లు దక్కితే.. అందులో ఒకటి వరంగల్ నుంచి కావడం వల్ల బీజేపీ ఆశలు పెట్టుకుంది. దాన్నిబట్టి చూస్తే వరంగల్ లో ఓటర్లు బీజేపీ వైపు ఉన్నారని, కానీ వారిని తమ వైపునకు ఆకర్షితులను చేసేందుకు కావాల్సిన వ్యూహాలను అమలుచేస్తే గెలుపు తథ్యమని హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆ స్థానం కేంద్ర మంత్రి బండి సంజయ్ కు అప్పగిస్తే బాగుంటుందనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న బీజేపీ, తమ టాప్ లీడర్లను, కేంద్రమంత్రులను నేరుగా క్షేత్రస్థాయి ఎన్నికల బరిలోకి దించి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడే వేడిని పెంచేసింది. కేంద్ర మంత్రులు, ఎంపీలపై హైకమాండ్ పెట్టుకున్న నమ్మకాన్ని వీరు నిలబెట్టుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also read: Kavitha EC: ఈసీ నోటీసులపై తిరగబడ్డ కవిత.. ఢిల్లీ లాయర్లతో న్యాయపోరాటానికి స్కెచ్!