Manne Krishank: స్వేచ్చ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ వివాదాస్పద బ్యానర్లు ఏర్పాటు చేసిన కేసులో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ను గోపాలపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి వద్ద అభ్యంతరకర రీతిలో బ్యానర్లు ప్రదర్శించారన్న అభియోగంపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెడికవర్ ఆస్పత్రికి సంబంధించి 13,200 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ క్రిశాంక్ తన అనుచరులతో కలిసి హాస్పిటల్ వెలుపల బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఉపయోగిస్తూ, ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్టుగా వ్యంగ్యంగా వీటిని రూపొందించారు.
దీనిపై కాంగ్రెస్ నాయకుడు మెట్టు సాయి కుమార్ సీసీఎస్, సైబర్ క్రైమ్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో క్రిశాంక్, ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రతినిధులపై బీఎన్ఎస్ చట్టం 353(2), 352 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అరెస్టుకు ముందు క్రిశాంక్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ వివాదాస్పద లావాదేవీల ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యాపార ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే కేసులో గతంలో బీఆర్ఎస్ నాయకులు సాయికిరణ్, వినీత్ లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also read: తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!
క్రిశాంక్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ముఖ్యమంత్రి అవినీతిని ప్రశ్నించినందుకే కక్షపూరితంగా క్రిశాంక్‌ను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూనే ఉంటామని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి కుటుంబానికి మెడికవర్ ఆస్పత్రితో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తాజా అరెస్టు పరిణామాలతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు మరింత ముదిరాయి.
Also read: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?