BRS Committees: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టినప్పుడల్లా పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తామని అధినేత కేసీఆర్ ప్రకటిస్తున్నారు. కానీ ఆ ప్రకటనలు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో పార్టీ నేతలు, కేడర్ లోనే అసంతృప్తి నెలకొంది. ఏళ్లుగా పార్టీని నమ్మకొని పని చేస్తున్నా గుర్తింపు మాత్రం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీని వీడుతున్న ఘటనలు ఉన్నాయి. కారుకు సర్వీసింగ్ గండం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 8ఏళ్లుగా పార్టీ కమిటీలు వేయకపోవడంతో క్షేత్రస్థాయిలో యాక్టీవ్ గా పార్టీ కేడర్ లేదు. తాజాగా కేసీఆర్ కమిటీలు వేస్తామని ప్రకటన అయినా అమల్లోకి వస్తుందా? అనే చర్చజరుగుతుంది.
బీఆర్ఎస్ పార్టీ 2017 తర్వాత పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకు ఏ ఒక్క కమిటీ వేయలేదు. కేవలం జిల్లా అధ్యక్షులను, నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు ఇన్ చార్జులుగా ప్రకటించింది. మళ్లీ పార్టీ పదవులు ఎవరికి కట్టబెట్టలేదు. పార్టీ నుంచి ఇతర పార్టీకి వెళ్లిన నేతల పోస్టులను సైతం భర్తీ చేయలేదు. కేశవరావు పార్టీలో సెక్రటరీ జనరల్ పదవి ఉండగా ఆయన కాంగ్రెస్ లో చేరినా ఆపోస్టును కూడా తిరిగి భర్తీ చేయలేదు. ఇలా రాష్ట్ర కమిటీల్లోనూ పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామం ఇలా అధ్యక్షులు, ఇన్ చార్జులను మాత్రమే నియమించి పూర్తి కమిటీని వేయడం పెండింగ్ లో పెట్టింది. కమిటీల్లో చోటు కోసం ఎదురుచూసిన నేతల్లో నిరాశ నెలకొంది. కొందరు భంగపడ్డనేతలు ఏకంగా పార్టీ మారారు. అయినప్పటికీ పార్టీ మాత్రం లైట్ గా తీసుకుంది.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తుందని పార్టీ నేతలంతా ఆశించారు. 30నెలలుదాటినా పార్టీపై పార్టీ అధిష్టానం దృష్టిసారించలేదు. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల ముందు, మున్సిపల్ ఎన్నికల ముందు అయినా కమిటీలు వేస్తుందని భావించిన వారికీ నిరాశే ఎదురైంది. ఎన్నికలు అయిపోయినప్పటికీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి దృష్టిసారించలేదు. ఇది ఇలా ఉంటే గతేడాది ఫిబ్రవరి 19న తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీలు వేస్తామని సైతం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సభ్యత్వ, కమిటీల బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆతర్వాత వాటి ఊసేలేదు. ఆ సమావేశం వరకే ప్రకటన చేశారని నేతలే అభిప్రాయపడ్డారు.దానిపై కేసీఆర్ ఏనాడూ మళ్లీ ప్రస్తావించలేదు.
మళ్లీ కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీలు వేస్తామని ప్రకటించారు. ఇంతకు కమిటీలు వేస్తారా? అనే సందేహం పార్టీ కేడర్ లో చర్చజరుగుతుంది. పార్టీకి అన్ని జిల్లా కేంద్రాల్లో ఆఫీసులు నిర్మించారు. కానీ పార్టీ కేడర్ కు ఇప్పటివరకు శిక్షణ నిర్వహించలేదు. కనీసం వారికి గుర్తింపు ఇచ్చేందుకు కమిటీలు సైతం వేయలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉండటంతోనే వరుస ఎన్నికల్లో ఓటమిపాలైందని స్పష్టమవుతుంది. దీనికి తోడు పార్టీనేతలకు, కేడర్ కు మద్య గ్యాప్ ఉండటం, కేడర్ అభిప్రాయాలను నేతలను పట్టించుకోకపోవడం, కనీసం కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో గెలుపుకోసం పనిచేయలేదని కొంతమంది బహిరంగంగానే పేర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తప్పిదాలను ఆశించిన స్థాయిలో ఎండగట్టకపోవడానికి అన్ని అనుబంధ సంఘాల కమిటీలు లేకపోవడం, యాక్టీవ్ గా పనిచేయకపోవడమేననేది స్పష్టమవుతోంది. కేవలం విద్యార్థిసంఘం ఒకటే అడపాదడపా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది.
బీఆర్ఎస్ లో యాక్టీవ్ గాపనిచేసిన కవిత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత రాజకీయంగా మరింత యాక్టీవ్ అయ్యారు. ఏకంగా తెలంగాణ రాష్ట్రసేన(టీఆర్ఎస్)పార్టీని ప్రకటించారు. దీంతో గులాబీ పార్టీ అలర్టు అయినట్లు స్పష్టమవుతోంది. కేడర్ కు కేసీఆర్ దూరంగా ఉంటున్నారని, ఎప్పుడో తప్ప కేటీఆర్ సైతం కలువరనే అపవాదు ఉంది. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం నెలకొంది. అయితే వారంతా కవిత పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలకు కేసీఆర్ పూనుకున్నారనే ప్రచారం మరోవైపు సాగుతోంది. దీంతో పార్టీని యాక్టివేట్ చేయడంపై నజర్ పెట్టారనే ప్రచారం ఊపందుకుంది. అందుకే పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, గ్రామస్థాయి నుంచి కొత్త కమిటీలు వేస్తామని ప్రకటించినట్లు ప్రచారం జరుగుతుంది. సుమారు 8 ఏళ్ల తర్వాత క్యాడర్ కు ట్రైనింగ్ ఇచ్చే ప్రకటన పై ముందుకు వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గానికి 200 మందికి శిక్షణ ఇస్తామని.. ఆ బాధ్యతలు కేటీఆర్ కు అప్పగిస్తున్నామని కేసీఆర్ ప్రకటించారని, కూతురు దూకుడుతో సొంత ఇంటిని (పార్టీని) చక్కబెట్టుకునే పనిలో గులాబీ అధినేత పడ్డారనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ గులాబీ అధిష్టానంలో మాత్రం చలనం వచ్చినట్లయింది.
Alao Read: పెళ్లి పేరుతో రూ.9కోట్లు చీటింగ్.. సీసీఎస్ విచారణ.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి!