Chinta Prabhakar: సంగారెడ్డి రాజకీయం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. బిఆర్‌ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగ్గారెడ్డి తీరుపై విమర్శల వర్షం కురిపించారు.
ఫ్రస్ట్రేషన్‌లో జగ్గారెడ్డి వ్యాఖ్యలు
నిన్న జరిగిన బీఎల్‌ఏ ల సమావేశంలో జగ్గారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఉండి, నోటికొచ్చినట్లు మాట్లాడారని చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి తీరు ఎలా ఉందంటే ‘చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన పుర్రెకి పాలిచ్చినట్టు’ ఉందంటూ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డికి అబద్ధాలు చెప్పడంలో ‘ఆస్కార్ అవార్డు’ ఇవ్వొచ్చన్నారు. ఆయన మాటలకు అసలు విలువే ఉండదని, ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని దుయ్యబట్టారు.
సెంటిమెంట్ రాజకీయాలు, నిజాలు
ఆనాడు జగ్గారెడ్డిపై కేసు పెట్టింది BRS కాదని, సొంత కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే గుర్తుచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయడానికే 2017లో సభలు పెట్టారని తెలిపారు. 2018 ఎన్నికల్లో ‘నన్ను గెలిపించకపోతే కేసీఆర్, హరీష్ రావులు చంపేస్తారు’ అని అబద్ధపు సెంటిమెంట్ రాజేసి ఓట్లు పొందారని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేటప్పుడు జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
అవినీతి, ఆక్రమణల చరిత్ర
జగ్గారెడ్డి ఎప్పుడు గెలిచినా దృష్టి అంతా అసైన్డ్ భూములపైనే ఉంటుందన్నారు. ఆయన ప్రజల కోసం కాకుండా స్వార్థం కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. 1995లో జగ్గారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో చేసిన తీవ్ర అవినీతి వల్లే ఆరుగురు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారన్నారు. త్వరలోనే పూర్తిగా రాజకీయ బొంద పెడతారని అన్నారు. నేను గెలిచినా, ఓడినా ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉన్నానని, జగ్గారెడ్డికి మాత్రం ప్రజా సమస్యలు పట్టవని స్పష్టం చేశారు.
Also Read: మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!