CM Revanth Reddy: వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నష్టాలపై సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమగ్ర నివేదికతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బృందం ఢిల్లీకి వెళ్లనున్నారు. మృతుల కుటుంబాలకు, పశువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం విడుదల చేయాలని ఆదేశించారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద 10 కోట్లు జారీ చేస్తామన్నారు.
గతేడాది వరద పరిహారం, ఇతర వివరాలపై ఆరా
గతేడాది వరద పరిహారం.. ఇతర వివరాలపై కూడా ఆరా తీసారు సీఎం రేవంత్ రెడ్డి. విపత్తుల సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు తక్షణమే రంగంలోకి దిగాలన్నారు. నీటి వినియోగదారుల సంఘాల పునరుద్ధరణపై నివేదికను సమర్పించాలన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. దాంతో పాటు విద్యుత్ సబ్‌స్టేషన్ల పునర్నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు,పశువులకు సైతం పరిహారం
ఎస్డీఆర్ఎఫ్ నిధులున్నా వాటిని వ్యయం చేయడంలో అలసత్వం చూపడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్రం నుంచి సరైన సహాయం అందకపోవడంపై కూడా ఆరా తీసారు. వ్యవసాయ, పశు సంవర్ధక, నీటిపారుదల, ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్.. వైద్యారోగ్య, విద్యుత్ శాఖల పరిధిలో వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండి పడిందన్న అధికారులు
ఈ నివేదికలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం… ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి అందజేయనున్నట్లు తెలిపారు. వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండి పడిందన్నారు అధికారులు. చిన్న నీటి పారుదల విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. వాటికి కూడా మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు.
Also Read: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!
దాదాపు 82 మండలాల్లో2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం
ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఆస్పత్రుల భవనాల పనులు వేగవంతం చేయడంతో పాటు.. వాటి ప్రారంభానికి తేదీలు నిర్ణయించాలన్నారు సీఎం. సహాయక పనులు వేగవంతం చేసి, పరిహారాలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో 42 ఆపరేషన్లలో పాల్గొని 217 మందిని.. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించడంపై హర్షం వ్యక్తం చేశారు.