Crop Damage: ధరూర్ మండలం భీంపురం గ్రామంలో గడ్డి మందు పిచికారీతో పంట నష్టపోయిన రైతు సమస్యపై వ్యవసాయ శాఖ అధికారుల స్పందనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క పొలంలో పిచికారీ చేసిన గడ్డి మందు తమ పంటకు నష్టం కలిగించిందని రైతు వేణుగోపాల్ ఫిర్యాదు చేసినప్పటికీ, సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడంలో మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు.
నిషేధిత రసాయనాల వినియోగంపై వ్యవసాయ శాఖకు సమాచారం అందించి, పంట నష్టాన్ని పరిశీలించాలని కోరడం తమ బాధ్యతేనని రైతులు చెబుతున్నారు. అయితే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తమపైనే ఎంఏఓ ఆగ్రహం వ్యక్తం చేశారని, తమతో అనుచితంగా మాట్లాడారని ఆరోపిస్తూ ధరూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రైతులు జిల్లా వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు వెల్లడించారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నించిన సమయంలో కూడా తమకు ఎంఏఓ నుంచి క్షమాపణ కోరడం, లేనిపక్షంలో కేసు పెడతానని చెప్పినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
పంటకు నష్టం జరిగిందని ఫిర్యాదు చేసిన రైతుల సమస్యను పరిష్కరించాల్సిన వ్యవసాయ శాఖ.. అసలు నిషేధిత మందు వినియోగించారా? పంటకు ఎంత నష్టం జరిగింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల నష్టం వాటిల్లింది? అనే అంశాలపై ముందుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. రైతుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, నిషేధిత రసాయనం వినియోగం నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి బాధిత రైతుకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రైతుల ఫిర్యాదుపై మండల వ్యవసాయ అధికారి తీరుపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Also read: స్కూల్లో స్టూడెంట్ రౌడీ వేషాలు… టీచర్ ఇచ్చే ట్విస్టుకు పట్టపగలే చుక్కలు… కొరియన్ టీచరా మజాకా