Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉండటంతో నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి తరలివచ్చారు. రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లలో ఉన్న భక్తులను మాత్రమే అనుమతించారు ఉత్సవ కమిటీ. దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
రేపటి నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి..
రేపు నిమజ్జనం ఉండటంతో ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది బడా గణేశ్‌ను దర్శించుకున్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ట్యాంక్‌బండ్‌వైపు వస్తున్న వాహనాలకు ఆంక్షలు విధించనున్నారు. నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్లే మేర గణేష్ శోభాయాత్రలో కొనసాగనున్నట్లు పేర్కోన్నారు. నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే సీపీ ఆనంద్ రూట్ మ్యాప్ రెడీ చేశారు. వాహనదారులు ఆయా రూట్లలో వెళ్లాలని సూచించారు.
శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుంది. నిన్న అర్ధరాత్రి నుంచి మహాగణపతిని క్రేన్ మీదకు చేర్చే పనులు ప్రారంభమయ్యాయి. రాత్రి మొత్తం వెల్డింగ్ పనులు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడి శోభాయాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం 1.30లోపు నిమజ్జన వేడుక పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపారు.
గ్రేటర్ వ్యాప్తంగా 30వేల మంది పోలీసుల మోహరింపు
గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 30 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉంచగా, ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధం చేసింది. నిమజ్జనానికి 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు, అత్యవసర పరిస్థితుల కోసం 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు.
Also Read: ఆ ముగ్గురు కలిస్తే తట్టుకోవడం కష్టమే.. భయంలో ట్రంప్
శానిటేషన్ కోసం 14,486 మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది
పరిశుభ్రత కోసం జీహెచ్‌ఎంసీ 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని కేటాయించింది. రాత్రి వేళల్లో సౌకర్యం కోసం 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాల్లో రహదారులు గుంతమయంగా మారిన విషయం మనకు తెలిసిందే.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు. పగలు, రాత్రి కష్టపడి రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నట్లు పేర్కోన్నారు. అధికారులు అంచనా ప్రకారం రేపు సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయి.