CM Revanth Reddy: రాష్ట్రంలో కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవని.. అనుభవించి తీరాల్సిందేనని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల, వీళ్ల వెనక తానేందుకు ఉంటానని మండిపడ్డారు. తాను ఉండేది తెలంగాణ ప్రజల వెనక అని చెప్పారు. వాళ్ల కుటుంబాల పంచాయతీలోకి తనను లాగొద్దని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం కాలం చెల్లిన నోట్ల లాంటోళ్లని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటా..
కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యులు కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇవాళ వాళ్ళే తన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు. ఒకరి వెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాను. నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుంది..
వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే.. లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారు. మీరంతా దిక్కుమాలినవారని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు. అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా? దయచేసి మీ కుటుంబ పంచాయతీలోనో… మీ కుల పంచాయతీలోనో.. మమ్మల్ని లాగకండి. మాకు ఎలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు. కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ.. కాలగర్భంలో కలిసిపోతుంది. ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుంది’ అని సీఎం మాట్లాడారు.
పాలమూరు వలసలకు కారణం ఇదే..
పాలమూరు అంటే ఒకప్పుడు వలసలకు మారు పేరని.. మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలదే భాగస్వామ్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి కారణం చదువు, నీరు లేకపోవడం అని చెప్పారు. ఈ రెండు అందుబాటులో లేకపోవడం వల్లే వలస వెళ్లేదని పేర్కొన్నారు. ఈ రోజు పాలమూరు బిడ్డే రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రణాళికలు రచించకపోతే చాలా కోల్పోతామని అన్నారు.
ALSO READ: MLC Kavitha: సంతోష్ రావ్.. చిరంజీవి, ప్రభాస్‌లను కూడా మోసం చేశాడు..
మహబూబ్ నగర్ కు ట్రిపుల్ ఐటీ మంజూరు చేశాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో వలసలు ఆగిపోవాలంటే చదువుతోనే సాధ్యం అవుతుంది. పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ ను తీసుకొచ్చాం. దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి ఆ స్కూల్స్ మంజూరు చేశాం. నిధుల కొరత ఉన్నప్పటికీ పథకాలను అమలు చేస్తున్నాం. భూములు కోల్పోయిన వారికి నష్టం జరగనివ్వం’ అని సీఎం పేర్కొన్నారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని సీఎం అన్నారు. అలా చేస్తే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళం అవుతామని చెప్పారు.
ALSO READ: TG High Court: కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్..స్టే కు నో చెప్పిన హైకోర్టు