GHMC Nala Scam: స్వేచ్ఛ బ్యూరో: ప్రతి వర్షాకాలంలో కుండపోత వర్షం కురిసినపుడు వరద నీరు నాలాల్లో ఎలాంటి ఆటంకాల్లేకుండా ప్రవహించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ప్రతి వర్షాకాలానికి ముందు నాలాల్లోని పూడికతీత పనులను చేపడుతుంది. మూడు ముక్కలుగా కాకముందున్న 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని జీహెచ్ఎంసీలో భారీ, మధ్య, చిన్న తరహా నాలాలు సుమారు 900 పై చిలుకు కిలోమీటర్ల పొడువున ప్రవహిస్తుంటాయి. వీటలో భారీ నాలాలు 398 కిలోమీటర్ల పొడువున ప్రవహిస్తుండగా, పైప్ లైన్ డ్రెయిన్ లు, చిన్ తరహా నాలాలు దాదాపు 600 కిలోమీటర్ల పొడువున ప్రవహిస్తున్నాయి. వీటిలోని పూడికను బయటకు తీసి, జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సుమారు రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు నిధులను కేటాయిస్తుంది. టెండర్లు చేపట్టి కాంట్రాక్టర్లకు పనులను అప్పగిస్తుంది. పూడికతీత పనులను ప్రతి సర్కిళ్ల వారీగా ఉన్న ఇంజనీర్లు ఎప్పటకపుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పర్యవేక్షణ బాధ్యతలను ఇంజనీర్లకు అప్పగించటంతో ఇక వారికి అది సువర్ణావకాశంగా మారింది.
ఎమ్మెల్యేల ఫిర్యాదుతో కదిలిన కమిషనర్!
నాలాల్లోని పూడికతీత పనుల్లో వరుసగా కుంభకోణాలు చోటుచేసుకోవటంతో ఈ పనులను గత సంవత్సరం నుంచి మున్సిపల్ శాఖ హైడ్రాకు అప్పగించింది. కానీ 2024-2025 మధ్య జరిగిన నాలాల పూడికతీత పనుల్లో భాగంగా భారీ నాలాలైన పాతబస్తీలోని ముర్కీ నాలా, శంకర్ పల్లి నుంచి ప్రవహిస్తూ వచ్చి, అహ్మద్ నగర్, చింతల్ బస్తీ మీదుగా హుస్సేన్ సాగర్ లో కలుస్తున్న బల్కాపూర్ నాలాల్లో పనులు సక్రమంగా జరగలేదని, తాము సిఫార్సు చేసిన పనులను సైతం కాంట్రాక్టర్లు చేపట్టలేదని సిటీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా కమిషనర్ కు ఫిర్యాదులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై చేయని పనులను చేసినట్లు రికార్డులు సృష్టించి పాతబస్తీతో పాటు న్యూ సిటీలోని నాలాల్లో పూడికను బయటకు తీసి, జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించినట్లు బిల్లులు క్లెయిమ్ చేసినట్లు కూడా ఎమ్మెల్యేలు నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజిలెన్స్ అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పాత స్టైల్ లోనే బిల్లుల క్లెయిమ్..
ముఖ్యంగా పద్నాలుగేళ్ల క్రితం ఇదే తరహాలో నాలాల్లోని పూడికతీత పనుల్లో ఏకంగా రూ. 40 కోట్ల వరకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఏకంగా పది మంది ఇంజనీర్లను బాధ్యులను చేస్తూ ఉన్నతాధికారులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించారు. తిరిగి ఇలాంటి కుంభకోణాలు వెలుగులోకి రాకుండా ఉండేలా ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా, ఆశించిన ఫలితం దక్కటం లేదు. ఆ తర్వాత నాలా పూడికతీత పనులను కేవలం ఎండకాలంలోనే చేపట్టాలన్న నిబంధనను ఎత్తివేసి, ఏడాది పొడువున నిరంతరం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూడా పూడికతీత పనుల్లో ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల కుమ్మక్కుతో అక్రమాలు వెలుగుచూడటంతో హైడ్రాతో విచారణ కూడా చేయించినా, 2024-25 మధ్యకాలంలో చేపట్టిన పూడికతీత పనుల్లో మళ్లీ అక్రమాలు చోటుచేసుకోవటం గమనార్హం. గతంలో జరిగిన అక్రమాల మాధిరిగానే నాలాల్లోని పూడికను బయటకు తీయకుండానే, దాన్ని క్యూబిక్ మీటర్లలో లెక్కలేసి, దాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు వినియోగించిన వాహానాల నెంబర్లతో సహా క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బైకులు, ఆటోల్లో మట్టి రవాణా?
అప్పట్లో తీసిన పూడికతత ను తరలించేందుకు మూలన పడ్డ కార్లు, లారీలతో పాటు ఆటోలు, ద్విచక్రవాహానాల నెంబర్లతో బిల్లులను క్లెయిమ్ చేసిన విధంగానే మరోసారి 2024-25 మధ్య చేపట్టిన నాలాల్లోని పూడికతీత పనులకు సంబంధించి బిల్లులు క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. బల్కాపూర్ నాలాలో తీయని పూడికతీసినట్లు బిల్లులు క్లెయిమ్ చేసిన వ్యవహారంలో కాంట్రాక్టర్లకు ఖైరతాబాద్ జోన్ కు చెందిన ఓ ఇంజనీర్ మిలాఖత్ అయినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాలా పూడికతీత పనుల్లో అక్రమాలు జరిగాయన్న విషయం బయటకు రాక ముందు రెండు సర్కిళ్ల బాధ్యతలను నిర్వహించిన సదరు ఇంజనీర్ ను ప్రస్తుతం ఒకే సర్కిల్ కు పరిమితం చేసినట్లు సమాచారం.
Also Read: ఆయుధాల నౌకపై విరుచుకుపడ్డ దొంగలు.. డ్రోన్ దాడితో నలుగురు ఖతం, 22 మంది భారతీయులు బందీ!