Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం కావాలన్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన మహనీయుడు కాన్షీరాం అని , ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాన్షీరాం వర్ధంతి సందర్భంగా శుక్రవారం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాన్షీరాం స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామన్నారు. అణగారిన వర్గాలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ఆ మహనీయునికి మనమిచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా అణగారిన వర్గాలను అసెంబ్లీకి తీసుకెళ్లి తీరుతామన్నారు. తెలంగాణ రక్షణ సేన సామాజిక న్యాయ సంకల్పానికి కాన్షీరామే స్ఫూర్తి అని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలంతా ఈ సామాజిక న్యాయ సంకల్పానికి కట్టుబడి, బహుజన సాధికారత కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటికి పాంచజన్యం తీసుకెళ్లండి
తెలంగాణ రక్షణ సేన ప్రధాన సిద్ధాంతమైన పాంచజన్యాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కవిత పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కవిత మాట్లాడుతూ, ప్రజలకు ఏ సమస్య ఉన్నా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి అండగా నిలవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో రైతులను దోపిడీ చేస్తున్న దళారులను పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తే ఇప్పుడు అన్ని పార్టీలు రైతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతి నాయకుడు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. వాటిపై ఎక్కడిక్కడ ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. ప్రధాన రాజకీయ పార్టీలతో మనం తలపడాల్సి ఉంటుందని.. అందుకు పార్టీ నాయకత్వం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఓటరుగా నమోదు
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓటరుగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తన ఓటు నమోదు చేసుకున్నారు. ఓటరు నమోదుపత్రం ఫిల్ చేశారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానాల్లో అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సరైన సమయం ఇదేనని యువతకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రశ్నించే గొంతుక అని.. తమ పార్టీ నుంచి రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో మంచి వాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికైనా యువకులు, నిరుద్యోగులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read: ఒక్క వ్యక్తిని కాపాడేందుకే ఈ తాపత్రయమా? కేంద్ర ఎన్నికల సంఘంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు