Jurala Water: స్వేచ్ఛ బ్యూరో: కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో పెన్నా బేసిన్‌లో ఉన్న కుప్పం వరకు తరలిస్తుంటే.. పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు తరలించడం లేదని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిలదీశారు. జూరాల ఆయకట్టు పొలాలకు సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న రైతులు, ఉమ్మడి పాలమూరు బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు ఇతర నాయకులను అక్రమంగా నిర్బందించడం దుర్మార్గం అన్నారు. ఇది కాంగ్రెస్ పాలనా వైఫల్యం కాదా? పాలకుల చేతగానితనం కాదా? అన్నారు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లపూర్ (8.51 టీఎంసీ), ఏదుల (6.55టీఎంసీ), కరివెన(17.34టీఎంసీ), వట్టెం (16.74టీఎంసీ) మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలను నిర్మిస్తే.. వాటిని నీళ్లతో నింపే సోయి కూడా ప్రభుత్వానికి లేదా? అని మండిపడ్డారు.
Also read: ఖాతాల్లో రూ.813 కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కలెక్టర్లపై మంత్రి ఉత్తమ్ ఫైర్!
గడిచిన రెండున్నరేళ్ల పాటు కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు పారినా ఎందుకు మోటర్లను నడపలేదు?శ్రీశైలం నిండుకుండలా ఉన్నా రైతులకు నీళ్లు ఎత్తిపోసే ఆలోచన ఎందుకు చేయలేదు?కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారు? నీళ్ల మంత్రిదీనికి సమాధానం చెబుతారా? పాలమూరును ప్రాజెక్టును పడావు పెట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం పాలమూరు రైతులకు చేస్తున్న నమ్మకద్రోహం ఇదన్నారు. ప్రభుత్వానికి రైతులంటే ఎందుకు అంత నిర్లక్ష్యం?వ్యవసాయం అంటే ఎందుకు ఇంత పట్టింపులేని తనం? అన్నారు. జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించి, ఆనకట్ట పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారు? ఎందుకింత దౌర్జన్యం? రైతులు నీళ్లు అడుగుతుంటే, వాళ్ల చేతికి సంకెళ్లు వేస్తారా?అని నిలదీశారు.
కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు.నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు..తప్పు మీరు చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా?ఎల్ ని నో సాకు చెప్పి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటారా?సాకులు చెప్పి తప్పించుకుంటే.. సాగు ముందుకు పోతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంట పొలాలకు సాగు నీళ్లు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. జూరాలలో 8.4 టీఎంసీల నీరు ఉన్నా కూడా రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఎందుకు మనసు రావడం లేదన్నారు. పంట పొలాలు ఎండుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతుంటే అది మీకు కనిపించడం లేదా?జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీళ్లు విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న మా పార్టీ నాయకులను రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also read: గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!