Hayathnagar : అది ఓ జాతీయ పార్క్.. గత ముప్పై ఏళ్లుగా వినియోగంలోనే ఉంది. అలాంటి భూమిని గజానికి రూ.35 వేల లెక్క విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అదేమిటంటే.. 1336 ఫసలీ రికార్డులు చూడండి.. ఈ భూములు మావే అంటూ నమ్మించేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా హైదరాబాద్ – విజయవాడ హైవే పక్కన, ఎల్బీ నగర్ కి కూతవేటు దూరంలోని వనస్థలిపురం దగ్గర జరుగుతోంది. అక్కడి హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనం.. భూముల్ని తమవిగా చెప్పుకుంటూ విక్రయిస్తున్నారు కొందరు మోసగాళ్లు. వారి మాటల్ని నిజమే అని నమ్మి డబ్బులు కట్టి మోసపోతున్నారు అనేక మంది అమాయకులు. అసలు.. ఈ పార్క్ భూముల అక్రమ విక్రయాల సంగతేంటి..
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే వనస్థలిపురం దగ్గర హరిణ వనస్థలి జాతీయ పార్కు ఉంది. దీని మొత్తం విస్తీర్ణం.. 582 ఎకరాలు. ఇక్కడ అనేక రకాల పక్షులతో పాటు జింకలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇందులో సఫారీ రైడ్ కూడా ఉంటుంది. నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఈ మొత్తం పార్క్ అటవీ శాఖ పరిధిలో ఉంది. కాగా.. ఇటీవల మహ్మద్ జిలానీ అనే ఓ వ్యక్తి పార్కును ఆక్రమిద్దాం, అవన్నీ మన భూములే, భూముల్లో జెండాలు ఎగరేద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో.. ఈ విషయం అటవీ శాఖ అధికారుల దృష్టికి రాగా.. విషయం ఆరా తీశారు. అప్పుడు కానీ.. అసలు విషయం వెలుగులోకి రాలేదు. ఈ భూమిని కొందరు కేటుగాళ్లు అమాయకులకు 60, 70, 90 గజాల చొప్పున విక్రయించారు. వారి దగ్గర నుంచి రూ.కోట్లు దండుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని యూనస్ ఖాన్, సుల్తానాలు అనే వ్యక్తులు తక్కువ ధరలకే స్థలాలిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. హరిణి వనస్థి పార్కు ఉన్న భూములు తమవే అని, కావాలంటే కాగితాలు చూడండి అంటూ తప్పుడు డాక్యుమెంట్లు చూపిస్తూ దగాకు పాల్పడుతున్నారు. వీరి మోసానికి వేల మంది బలైనట్లు పోలీసులు గుర్తించారు. అసలు విషయం ఏంటంటే.. పార్క్ స్థలం 582 ఎకరాలు ఉంటే ఈ కేటుగాళ్లు ఏకంగా 2,400 ఎకరాలకు విక్రయాలు జరిపించారు. అంటే ఉన్న భూమికి నాలుగింతలు ఎక్కువగా విక్రయాలు చేసి.. కోట్లల్లో సంపాదించుకున్నారు. ఈ విషయంపై దృష్టి పెట్టిన రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారులు.. తప్పుడు విక్రయాలకు సంబంధిన ఆధారాలు సేకరిస్తున్నారు.
పార్క్ మాదే.. ప్రభుత్వం ఆక్రమించింది
వనస్థలి పురంలోని హరిణ వనస్థలి పార్కు భూమి అంతా పట్టాభూమి అని వాటిని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చంటూ మోసగిస్తున్నారు. ఆ భూములకు సంబంధించి తప్పుడు పత్రాలు చూపించి విక్రయాలు చేస్తున్నారు. ఎప్పుడో నిజాం కాలం నాటి ఫసలీ రికార్డుల ప్రకారం.. ఈ భూములు హనీఫాబీ అనే మహిళకు చెందినవి అని, వాటిలో కొన్నింటిని అటవీ శాఖకు లీజుకు ఇచ్చినట్లు చెబుతున్నారు. తమ భూముల్ని అటవీ శాఖ అక్రమించిందని.. అవన్నీ తమకే చెందుతాయంటూ కొనుగోలుదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. అలా.. 90 గజం భూమిని రూ.35 వేలకు విక్రయిస్తుండగా, అనేక మంది అత్యాశతో కొనుగోలు చేసి మోసపోతున్నారు. పైగా.. పార్కును ఆక్రమిద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉద్రిక్తతలు రేపుతున్నారు.
Also Read : ఏకంగా ఓ రాష్ట్ర గవర్నర్ ఫోన్ ట్యాపింగ్.. అతన్ని ఎందుకు టార్గెట్ చేశారంటే..