Huzurabad Farmer: స్వేచ్ఛ బ్యూరో: అధికార పార్టీ అండదండలతో పేద రైతు భూమిని కాజేసి, బెదిరింపులతో ఆత్మహత్యకు ప్రేరేపించిన సర్పంచ్ భర్త పత్తి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
వెంకట్రావుపల్లికి చెందిన రైతు కన్నెబోయిన ఓదెలు 2018లో పత్తి విష్ణువర్ధన్‌రెడ్డి వద్ద సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన ఎకరం నాలుగు గుంటల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. న్యాయపరమైన చిక్కుల వల్ల రిజిస్ట్రేషన్ ఆలస్యం కావడాన్ని ఆసరాగా చేసుకుని, సర్పంచ్ భర్త రామకృష్ణారెడ్డి రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమిని అక్రమంగా తన పేరిట నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. భూమిని వదిలేస్తే డబ్బులు ఇస్తానని నమ్మబలికి, తీరా అప్పులు చేసి బిడ్డ పెళ్లి చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా బాధితుడిని కులం పేరుతో అవమానించి తీవ్రంగా బెదిరించారని పేర్కొన్నారు.
ఈ మోసాన్ని, అవమానాన్ని తట్టుకోలేక ఓదెలు పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి భూమిని దక్కేలా చూడాలని, లేనిపక్షంలో రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు అండగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు తిరుగమల్ల నాగార్జున, నాయకులు బొడ్డు దేవదాస్, బొడ్డు సుమన్, ఇమ్మడి ఉదయ్‌కుమార్, మృతుడి కుమారుడు కన్నెబోయిన కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Also read: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?