Honey Trap Case: హానీ ట్రాప్ పేరుతో వృద్ధులను టార్గెట్ చేస్తూ రూ.లక్షలు కొల్లగొట్టిన నిందితున్ని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లు యువకులను, మధ్యవయస్కులను మాత్రమే హానీ ట్రాప్ తో టార్గెట్ చేస్తుండగా.. ఇప్పుడు వృద్ధులను సైతం కేటుగాళ్లు లక్ష్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్ కు చెందిన 70 సంవత్సరాల వయస్సు గల రిటైర్డ్ ఉద్యోగికి ఆరు నెలల క్రితం ఓ మహిళ పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. బాధితుడు రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ ఫేస్ బుక్ ద్వారా తరచూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ మహిళ అవసరాల పేరుతో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంది. కొంతకాలం తర్వాత మరొక వ్యక్తి ఫోన్ చేసి, తాను ఆ మహిళ బంధువునని పరిచయం చేసుకున్నాడు.
ఆ తర్వాత సదరు మహిళ బాధితుడితో అసభ్యకరమైన సంభాషణలు చేస్తూ, ఆకర్షణీయమైన మాటలతో నమ్మించింది. కొద్దిరోజులకు ఫేస్ బుక్ చాట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నిరాధార ఆరోపణలు చేసి క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించి బాధితుడి నుంచి రూ.38 లక్షలు కొల్లగొట్టింది. చివరికి తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితుడ్ని ఏపీలోని పాలకొల్లుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడ్ని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైం అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికలపై తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దన్నారు. వారితో వ్యక్తిగత సంభాషణలు పెట్టుకోవద్దని హితవు పలికారు.
Also Read: పోస్టాఫీసు సూపర్ డూపర్ స్కీమ్.. రోజూ రూ.300 దాస్తే చాలు.. చేతికి రూ.6.4 లక్షలు!
మరోవైపు డిజిటల్ అరెస్ట్ మోసాలపై స్పందిస్తూ.. ఏ కేసులో కూడా పోలీసులు ఫోన్ ద్వారా ఎప్పుడూ డబ్బు డిమాండ్ చేయరని తెలిపారు. ఎవరైనా పోలీసులమని చెప్పి డబ్బు డిమాండ్ చేస్తే మోసం అని గుర్తించాలన్నారు. తమ తమ మీ సోషల్ మీడియా ప్రొఫైళ్లను ప్రైవేట్ గా ఉంచుకోవాలని చెప్పారు. ఎవరైనా క్రిమినల్ కేసుల పేర బెదిరిస్తే వెంటనే కాల్, చాటింగ్ నిలిపివేయాలన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. లేదంటే https://cybercrime.gov.in వెబ్ సైట్ కు సమాచారం ఇవ్వొచ్చన్నారు.
Also Read: దీపావళి స్పెషల్.. ఇంటికి గ్రాండ్ లుక్ ఇచ్చే.. చౌకైన ఎల్‌ఈడీ స్ట్రింగ్ లైట్స్!