Water Bills: స్వేచ్ఛ బ్యూరో: జంటనగరవాసులు దాహర్తి తీరుస్తున్న జలమండలి ఎట్టకేలకు బిల్లుల వసూళ్లపై ఫోకస్ పెట్టింది. జలమండలి పరిధిలో వంద శాతం బిల్లింగ్ పూర్తి చేయడంతో పాటు దీర్ఘకాలిక బకాయిల వసూళ్లు, బిల్లింగ్ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి గురువారం రెవెన్యూ పని తీరుపై ఈడీలు, డైరెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జోన్, సర్కిల్, డివిజన్ వారీగా అన్‌బిల్డ్, అన్‌పెయిడ్ క్యాన్ లు, డిమాండ్, కలెక్షన్ వివరాలను ప్రత్యేక రెవెన్యూ డ్యాష్ బోర్డ్ ద్వారా పరిశీలించారు.
ఏళ్ల తరబడి బకాయిలు ఉన్నప్పటికీ కొన్ని కనెక్షన్లకు నీటి సరఫరా కొనసాగుతుండటంపై ఎండీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి క్యాన్ లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మీటర్, బిల్లింగ్ లేదా ఇతర సమస్యలను పరిష్కరించి బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే బకాయిలు ఉన్నాయనే కారణంతో విచక్షణారహితంగా కనెక్షన్లు తొలగించడం సరైన పరిష్కారం కాదన్నారు. అధిక డిస్‌కనెక్షన్ల వల్ల వివాదాలు పెరిగి, చివరకు రెవెన్యూ వసూళ్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల వినియోగదారుడి సమస్యను గుర్తించి, పరిష్కరించి, రావాల్సిన మొత్తాన్ని వసూలు చేయడానికే ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. దీర్ఘకాలిక బకాయిల విషయంలో అధికారులే ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని ఆదేశించారు.
ఐదేళ్లకు పైగా బకాయి ఉంటే జీఎం, ఏడాదికి పైగా ఉంటే డీజీఎం, ఆరు నెలలకు పైగా ఉంటే సంబంధిత మేనేజర్ స్వయంగా వినియోగదారులను వ్యక్తిగతంగా సంప్రదించాలని సూచించారు. బిల్లింగ్, మీటర్ లేదా ఇతర వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించి వసూళ్లకు చర్యలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు హై ప్రయారిటీ బకాయిదారులను గుర్తించి ఒక్కో మేనేజర్‌కు 10 కనెక్షన్లు చొప్పున అప్పగించాలని, వాటిని పరిష్కరించిన తర్వాత మరో 10 కనెక్షన్లను ఇవ్వాలని సూచించారు. మూడు రోజుల తర్వాత పురోగతిని తిరిగి సమీక్షిస్తామని తెలిపారు. టాప్-10, టాప్-100 బకాయిదారుల జాబితాలను రూపొందించి క్షేత్రస్థాయి సిబ్బందికి అందించి నిరంతరం ఫాలోఅప్ చేయాలన్నారు.
Also read: సెప్టెంబర్ నుంచి ఇవి మారబోతున్నాయ్.. ఆగస్టు 31 లోపు పూర్తి చేయకపోతే.. సామాన్యుల జేబుకు చిల్లే!
బల్క్ కనెక్షన్లు, మీటర్లు లేకపోవడం, పాత బిల్లులు తదితర కారణాలతో పెండింగ్‌లో ఉన్న వివాదాలు పరిష్కారానికి సర్కిల్ స్థాయిలో 4 నుంచి 5 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ వారానికి ఒక రోజు సమావేశమై కనీసం 10 నుంచి 15 వివాదాలను పరిశీలించి పరిష్కరించేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. అదే విధంగా డాకెట్ యావరేజ్ బిల్లింగ్‌లో ఉన్న వ్యత్యాసాలను 15 రోజుల పాటు అధ్యయనం చేసి విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ సమీక్షలను కేవలం బిల్లింగ్, వసూళ్లకే పరిమితం చేయకుండా నీటి సరఫరా, పనుల పురోగతి, సేవా ఫిర్యాదులు, రెవెన్యూ తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించాలని సూచించారు. ప్రతి స్థాయిలో అధికారులకు స్పష్టమైన బాధ్యత ఉండాలని, డేటా ఆధారంగా రోజువారీ పనితీరును పర్యవేక్షిస్తూ బిల్లింగ్, వివాదాల పరిష్కారం, బకాయిల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
Also read: ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొత్తగా Android Pulse ఎందుకు వచ్చింది? గూగుల్ ఏం చెబుతోంది?
అధునాతన కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానంతో రూపొందిస్తున్న రెవెన్యూ డ్యాష్ బోర్డ్ ద్వారా బిల్లింగ్, బకాయిలు, కలెక్షన్లు, వివాదాల, హై ప్రయారిటీ క్యాన్ లను వేగంగా గుర్తించేందుకు వీలవుతుందని తెలిపారు. జోన్ నుంచి వ్యక్తిగత క్యాన్ వరకు అవసరమైన సమాచారాన్ని విశ్లేషించి, ఎక్కడ బిల్లింగ్ పెండింగ్‌లో ఉంది, ఎక్కడ వసూళ్లు తక్కువగా ఉన్నాయి? ఏ కనెక్షన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే అంశాలను గుర్తించేందుకు ఈ డ్యాష్ బోర్డ్ దోహదపడుతుందని జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్ అన్నారు.
తద్వారా అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి, బకాయిల వసూళ్లను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత ఈ డ్యాష్ బోర్డ్‌ను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీఎండీ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రీజనల్ డైరెక్టర్లు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్, ఆపరేషన్ డైరెక్టర్లు నారాయణ, వాసా సత్యనారాయణ, ప్రభు, రెవెన్యూ డైరెక్టర్ కిరణ్ కుమార్, సీజీఎంలు, జీజీఎంలు, రెవెన్యూ, ఐటీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Also Read: గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?