Manjeera Barrage: దశాబ్దాల చరిత్ర ఉన్న మంజీరా బ్యారేజీ.. డేంజర్ జోన్‌లో పడింది. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ప్రధానంగా హైదరాబాద్ మహా నగరానికి.. మంచి నీటిని సరఫరా చేస్తున్న డ్యాం ప్రమాదంలో ఉందని.. తక్షణం మరమ్మతులు చేయించకపోతే భవిష్యత్‌లో పెను ప్రమాదం తప్పదని ఇప్పటికే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ – SDSO తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంజీరా బ్యారేజీ వద్ద ఉన్న పరిస్థితిపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.
1965లో నిర్మించిన మంజీరా బ్యారేజీ.. 1975 నుంచి వినియోగంలోకి వచ్చింది. దీని పూర్తి సామర్థ్యం మూడు టీఎంసీలు. దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టు పక్కల ఉన్న పలు గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తోంది. కానీ ఇప్పుడు ఇదే మంజీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉంది. బ్యారెజ్ భద్రతపై SDSO నిపుణుల బృందం మార్చి 22న ఓ నివేదికను సమర్పించింది. బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించింది.
తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టికట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో గేట్లు, స్పిల్ వేలోని కొంత భాగం సైతం దెబ్బతిందని నివేదికలో పేర్కొంది. వరద ఉదృతితో కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే.. అది క్రమంగా డ్యామ్ వరకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రోజూ 10 కోట్ల గ్యాలన్ల నీరు అందిస్తున్న ఈ బ్యారేజీ నిర్వహణను హైదరాబాద్ మెట్రో వాటర్క్స్, నీటిపారుదల శాఖ పర్యవేక్షిస్తాయి.
నీటిని విడుదల చేసినప్పుడు బ్యారేజీ రక్షణ కోసం దిగువన నిర్మించిన ఆప్రాన్ కొంత వరకు కొట్టుకుపోయిందని SDSO తన రిపోర్ట్‌లో పేర్కొంది. కాంక్రీట్ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయని, మిగిలి ఉన్న అప్రాన్ భాగం ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యారేజ్ సామర్థ్యానికి మించి వరద రావడం, ఆ ఒత్తిడితోనే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు SDSO తన రిపోర్ట్‌లో వెల్లడించింది.
ఇది రాతి ఆనకట్ట కావడంతో ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఆనకట్టలకు ఉండే దృఢత్వం ఉండదని అభిప్రాయపడింది ఎస్‌డీఎస్‌వో రిపోర్ట్. పెద్ద సంఖ్యలో తుమ్మ చెట్లు పెరిగి బ్యారేజీ మట్టి కట్టలను దెబ్బతీస్తున్నాయని తేల్చింది. అడవిని తలపించేలా తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో 1.5 కిలోమీటర్ల మేర కట్టలను పరిశీలించ లేకపోయినట్టు పేర్కొంది. వీటి వల్ల డ్యామ్ రివర్బైడ్ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. బ్యారేజీని పటిష్ట పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అధ్యయనం జరిపించాలని సిఫారసు చేసింది.
Also Read: 25 వేల టన్నులు.. మన ఆడోళ్లు దాచిన బంగారమంత కాదు పాకిస్తాన్ బతుకు..
మరి.. ఇప్పటికైనా మంజీరా బ్యారేజీ మరమ్మతులకు మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.