Hydra Demolition: హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆక్రమణల తొలగించే కార్యక్రమంను కొనసాగిస్తున్న హైడ్రా, మరో కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. అనుమతి లేకుండా నగరంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులను తొలగించే దిశగా హైడ్రా అడుగులు వేసింది. అనుమతుల్లేని హోర్డింగుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కూడ హైడ్రా భావిస్తోంది. ఇప్పటికే పలు హోర్డింగులను సైతం హైడ్రా తొలగించడం విశేషం.
నగర శివారు ప్రాంతాలలో భారీ హోర్డింగులు కనిపిస్తుంటాయి. వీటిలో అనుమతులు ఉన్న హోర్డింగ్స్ కంటే, ఆనుమతుల్లేని వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు హైడ్రా గుర్తించింది. సాధారణంగా వ్యాపారాలు నిర్వహించే వారు, పబ్లిసిటీ కోసం హోర్డింగులను ఏర్పాటు చేస్తారు. ఆ హోర్డింగ్ ల ఏర్పాటుకు సంబంధిత అధికారుల వద్ద అనుమతులు తప్పక తీసుకోవాలి. ఏ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు? ఎంత సైజు హోర్డింగ్? ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా అనే కోణంలో ఆలోచించి అధికారులు, హోర్డింగ్స్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తారు. అయితే ఇవేమీ పట్టకుండా ఇష్టారీతిన హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. అందుకే హైడ్రా వీటి తొలగింపుకు శ్రీకారం చుట్టింది.
గత వారం రోజులుగా స్థానిక మున్సిపాలిటీ అధికారుల సమక్షంలో నగర శివారు మున్సిపాలిటీల్లో అనుమతి లేని హోర్డింగ్‌లను తొలగిస్తున్నారు. శుక్రవారం నుంచి గురువారం వరకు 53 హోర్డింగులను తొలగించారు. యూనిపోల్స్ 35, యూని స్ట్రక్షర్ 04, ఇంటి పై కప్పులపైన పెట్టిన హోర్డింగ్స్ 14 చొప్పున హోర్డింగులను తీసివేశారు. శంషాబాద్, కొత్వాల్‌గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా ఉన్న వాటిని హైడ్రా తొలగించింది.
హోర్డింగుల తొలగింపుపై హైడ్రా స్పీడ్ కాగా, యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు గురువారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిశారు. తనను కలిసిన ప్రతినిధులతో మాట్లాడిన కమిషనర్.. అనుమతులు ఉంటే ఏ హోర్డింగ్ ను తొలగించబోమని, అనుమతులు లేకుంటే మాత్రం తొలగించడం ఖాయమన్నారు. అనుమతులు లేనివాటిని తొలగించేందుకు వారం, 10 రోజులు సమయం కావాలని ప్రతినిధులు కోరగా, గతంలో సమయం ఇచ్చిన విషయాన్ని కమిషనర్ లేవనెత్తారు. స్వచ్చందంగా హోర్డింగులను తొలగించక పోవడంతో హైడ్రా తొలగించిందని, ఈ ప్రక్రియ నిరంతరం సాగుతుందని కమిషనర్ సమాధానమిచ్చారు.
ఇప్పటి వరకు ఆక్రమాణలపై కన్నేసిన హైడ్రా.. హోర్డింగులపై దృష్టి సారించగా, అనుమతులు తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు అభిప్రాయ పడుతున్నారు. అనుమతులు పొంది ఏర్పాటు చేసుకుంటే తమ నుండి ఎటువంటి ఇబ్బందులు ఉండవని కమిషనర్ తెలిపారు. మొత్తం మీద నగరంలో అనుమతుల్లేని హోర్డింగ్ లపై హైడ్రా దృష్టి సారించిందని చెప్పవచ్చు. హైడ్రా చేపట్టిన ఈ చర్యకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో హైడ్రా.. ఏయే అంశాలపై దృష్టి సారిస్తుందోనని చర్చ సాగుతోంది. ఓ వైపు ఆక్రమణల గుర్తింపు, మరోవైపు తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతం చేసిన హైడ్రా.. హోర్డింగ్స్ పై కూడ దృష్టి సారించి హైడ్రా అధికారులు బిజీ అయ్యారని చెప్పవచ్చు.