Jaggareddy: స్వేచ్ఛ బ్యూరో : సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల సంరక్షణే ధ్యేయంగా పార్టీ శ్రేణులు నడుం బిగించాయి. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా నుంచి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 282 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులతో ఆయన అత్యవసర సమావేశాన్ని (ఎమర్జెన్సీ మీటింగ్) ఏర్పాటు చేసి, ఓటర్ల సవరణ (సర్ – SSR) ప్రక్రియపై సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు.
ఓటర్ల సవరణపై అప్రమత్తత
ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఓటర్లకు భద్రత కల్పించాల్సిన పూర్తి బాధ్యత నాయకులదేనని గుర్తుచేశారు. ఈ ‘సర్’ (SSR) ప్రక్రియ ముగిసేలోపు నియోజకవర్గ స్థాయిలో 4 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని, మళ్లీ జూలై 6వ తేదీన దీనిపై లోతుగా చర్చిస్తామని వెల్లడించారు. ఈ ప్రతీ సమావేశానికి బూత్ లెవల్ ఏజెంట్లు, ఇంచార్జ్ లతో పాటు గెలిచిన, ఓడిన సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. 282 మంది బీఎల్ఏలు, ఇంచార్జ్ లు దీనికోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని, పార్టీ ఇచ్చిన కార్డులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, వారి పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Also Read: లక్ష్యం ఒక్కటే.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ.. గవర్నర్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ
కేంద్రంపై విమర్శలు
ఈ సమావేశంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ ప్రీతం, దయాకర్ తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఏం చెబితే కేంద్ర ఎన్నికల సంఘం అదే చేస్తోందని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో ఓట్లను అక్రమంగా తొలగించడం వల్లే బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయని, అందుకే రాహుల్ గాంధీ అప్రమత్తమై ఇలాంటి అవగాహన మీటింగులు పెట్టుకోవాలని సూచించారని తెలిపారు. దేశంలోని 543 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 300 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఎన్నికల కమిషన్ కంట్రోల్‌లో ఉంటుందని, ఈ ఓట్ల పంచాయతీకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రజల పక్షాన ఒంటరి పోరాటం చేస్తున్నారని, దేశంలో దుర్మార్గపు పాలన అంతమై, మంచి రోజులు రావాలంటే రాహుల్ ప్రధాని కావాలని వారు ఆకాంక్షించారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఎంపీ గెలుపు దేశ మార్పునకు ఎంతో కీలకమని, అందుకే హైకమాండ్ ఆదేశాల మేరకు పూర్తి జాగ్రత్తలతో ఈ క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు ప్రకటించాయి.