Jagityala Government Hospitalz : ఎన్నో ఇబ్బందులు, రోగాలతో ఆసుపత్రిలో చేరి ఇబ్బందులు పడుతున్న రోగుల వద్ద డీజేలు పెట్టుకుని డాన్సుల్లో మునిగిపోయారు.. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సులు, వైద్య సిబ్బంది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన సిబ్బందే రోగుల్ని ఇబ్బంది పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై వివిధ వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ ఘటన జగిత్యాలలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
ఆస్పత్రి, దాని పరిసర ప్రాంతాల్లో పెద్దపెద్ద శబ్దాలతో వాహనాలను రానివ్వరు. ఆసుపత్రి పరిసరాల్లో హారన్లు సైతం మోగించకూడదు అనే నిబంధన అమల్లో ఉంటుంది. ఎందుకంటే ఆసుపత్రిలోని రోగులు అనేక బాధలు ఇబ్బందులతో మానసికంగా అలసిపోయి ఉంటారు. అలాంటి వారి మానసిక ఆరోగ్య పరిస్థితికి ఇబ్బంది కలిగించే శబ్దాలను అంగీకరించరు. అలాంటిది ఏకంగా ఆసుపత్రిలోనే డీజే బాక్సులు, స్పీకర్లు ఏర్పాటు చేశారో ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో.. సంబంధిత నర్సులు, వైద్య సిబ్బందిపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. పదిమందికి చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వార్డుల వద్ద పెద్ద పెద్ద డీజే సౌండ్ బాక్సులు పెట్టి ఆసుపత్రి నర్సులు, వైద్య సిబ్బంది డాన్స్ చేశారు. రోగులు ఉన్నాయన్న సోయి కూడా లేకుండా డాన్సులు చేస్తూ ప్రాక్టీసులో మునిగిపోయారు. ఇది ఏంటని ప్రశ్నిస్తే.. రానున్న క్రిస్మస్ వేడుకకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామంటూ తెలిపారు. రోగులు ఇబ్బంది పడుతున్నారు అని తెలిపినా.. పట్టించుకోకుండా వారి మానాన వారు డాన్సులు చేసూ గడిపేశారు. పైగా ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సంబరపడిపోయారు వైద్య సిబ్బంది.
డ్యూటీ అవర్స్ లో రోగుల బాగోగులు వదిలిపెట్టి, వారి సేవలు చూసుకోవాల్సిన నర్సులు.. కొత్త కొత్త డీజే బాక్సులు సాంగ్స్ తో పాటలు పెట్టుకుని కోలాటాలు ఆడుకున్నారు. ఇదేమని ప్రశ్నించిన రోగులు, వాటి బంధువులకు.. సరిగా సమాధానం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన పేషెంట్లు వారి తరఫు బంధువులు.. ఇదేంటని ఆసుపత్రి జిల్లా వైద్యాధికారిని ప్రశ్నించగా సిబ్బంది కోరిక మేరకు అనుమతి ఇచ్చామంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
Also Read : ఇది రేవంత్ సర్కార్.. బిగ్ బాస్ విన్నరైనా.. నేషనల్ అవార్డ్ అందుకున్నా.. ఒకే న్యాయం
డ్యూటీ అవర్స్ లో అలా చేయడం సరైన విధానం కాదన్న జిల్లా వైద్యాధికారి.. సెమీ క్రిస్మస్ వేడుకల కోసం సిబ్బంది కోరగా అనుమతిచ్చామని తెలిపారు. అయితే వైద్యాధికారి వివరణ, నర్సులు, వైద్య సిబ్బంది వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగుల పర్యవేక్షణ, వారి బాగోగులు చూసుకోకుండా డ్యూటీ టైం లో ఇలా చేయడం సరైన విధానం కాదు అంటూ అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రిలో డాన్సులు చేసిన నర్సులు వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టాలని, రోగుల వార్డులో స్పీకర్లు పెట్టేందుకు అనుమతించిన వైద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.