Jagtial Shocking Incident: సాధారణంగా మన కంటి ఎదురుగా ఎవరైనా అచేతన స్థితిలో ఉంటే, మన కళ్లు చెమ్మగిల్లుతాయి. చేతనైతే ఇంత సాయం అందిస్తాం. కానీ అదే మన తల్లిదండ్రులకు ఆ కష్టం వస్తే.. తల్లడిల్లిపోతాం. ఇటీవల కొందరు కుమారులు మాత్రం తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే, నరకం అంటే ఇదీ అన్నట్లుగా భూలోకంలోనే వారికి యమలోకం చూపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తల్లి బ్రతికి ఉండగా ఆ నలుగురు కొడుకులు.. ఆ నలుగురిగా మోస్తూ.. తల్లిని స్మశానంలో వదిలేశారు. ఇంత దారుణానికి పాల్పడడానికి గల కారణం ఏమిటో తెలిస్తే ఔరా అనేస్తారు.
జగిత్యాలలో మోతె స్మశాన వాటిక ఉంది. అక్కడికి ఆ నలుగురు మోసుకుంటూ ఒకరిని అక్కడికి తీసుకువచ్చారు. ఎవరో చనిపోయారు అందుకేనేమో.. తీసుకువచ్చారని అనుకున్నారు అందరూ. అక్కడే ట్విస్ట్ తెలిసి ఖంగుతిన్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వకు నలుగురు కుమారులు. అయితే గత కొద్దిరోజులుగా వారి ఆప్యాయతకు తల్లి రాజవ్వ దూరమైంది. అది కూడా ఆ నలుగురు కుమారులలో ఒక కుమారుడు ఇటీవల పింఛన్ నగదు కోసం స్వయాన తల్లినే చితకబాదాడు.
చెప్పేందుకు నలుగురు కుమారులు ఉన్నా.. బువ్వ పెట్టే దిక్కులేని పరిస్థితి రాజవ్వది. ఎలాగైనా రాజవ్వను వదిలించుకోవాలనుకున్న వారు, బ్రతికి ఉండగానే నేరుగా స్మశానవాటికకు తరలించారు. ఇప్పటికే 8 రోజులుగా అన్నం పెట్టే దిక్కులేక, ఆశ్రయించే వారు లేక అక్కడే రాజవ్వ కాలం వెళ్లదీస్తోంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న సంక్షేమ శాఖ అధికారులు.. రాజవ్వను సంప్రదించారు.
రాజవ్వ ఉన్నది ఉన్నట్లుగా వివరించి, తనను ఆదుకోవాలని వారిని ప్రాధేయపడింది. వెంటనే రాజవ్వను వైద్యశాలకు తరలించి వారు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై సంక్షేమ శాఖ అధికారి నరేష్ మాట్లాడుతూ.. రాజవ్వ కుమారులపై వయోవృద్ధులు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏదిఏమైనా బాల్యంలో తన పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తుంటే చిరునవ్వులు చిందించిన ఆ తల్లి, ఈరోజు అవే అడుగులతో బ్రతికుండగానే స్మశానానికి తీసుకువస్తారని ఊహించలేక పోయింది.