Irrigation Crisis: స్వేచ్ఛ బ్యూరో: కష్టపడి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి ప్రతికూలత వల్ల నీటి సమస్యలు రైతన్నను వెంటాడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పలు ప్రాంతాలలో సాగుచేసిన పంటలకు సాగునీరు అందక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళముందే పంటలు వాడిపోతున్నా విపత్కర పరిస్థితిని చూసి అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి సాగు పైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు పంటల కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల రూపంలో భారీగా పెడుతున్నారు. పంట చేతికి వచ్చే దశలో నీటి కొరత ఏర్పడడంతో తమ శ్రమ అంతా వృధా అవుతుందని రైతులు వాపోతున్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో గతంలో మునుపేన్నడు లేని విధంగా వాణిజ్య పంట అయిన మిరపను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధరలు ఉండడంతో ప్రస్తుతం మిరప పంటను మెట్ట భూములలో సైతం సాగుతోంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య వల్ల పంటల పరిస్థితి పై సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి ప్రత్యామ్నాయం చూపాలని రైతులు కోరుతున్నారు.
పంటలకు కీలకమైన సమయంలో నీరు అందకపోవడంతో పొలాల్లో పచ్చదనం తగ్గి పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు ఒక వైపు పెట్టుబడుల భారం మరోవైపు పంటను కాపాడుకోవాలని ఆందోళనతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేటి దొడ్డి మండలం కొండాపూర్ గ్రామ శివారులో సాగు చేస్తున్న వరి పంటకు చివరి ఆయకట్టు దాకా నీరు రాక పంటను వదిలేస్తున్న పరిస్థితులు దాపరిస్తున్నాయి. దీంతో పంటను పశువులు,మేకలకు వదిలేశారు.
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 2009లో తవ్విన కాలువలకు నేటికీ సాగునీరు రాకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పంటలను కాపాడేందుకు తక్షణమే నీటి వసతి కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రస్తుతం ఎండిపోతున్న పంటను కాపాడేందుకు అత్యవసర చర్యలను చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు వెంటనే పంట పొలాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని రైతుల కోరుతున్నారు. ఆయకట్టు చివరిదాకా నేటి వరకు పారలేదని,ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లోనైనా రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
Also Read: బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం