RTC Elections: స్వేచ్చ బ్యూరో: ఆర్టీసీ గుర్తింపుసంఘం ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. గతం కంటే పోలింగ్ శాతం అత్యధికంగా నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,899 మంది ఓటర్లు ఉండగా 98శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 ఆర్టీసీ సంఘాలో బరిలో నిలిచాయి. ప్రధాన సంఘాలుగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీడబ్ల్యూయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. కార్మికులు తమ విధులకు అంతరాయం కలగకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర వ్యాప్తంగా 115 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో 97 డిపోలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో 99 శాతం, హైదరాబాద్ లో 98 శాతం, కరీంనగర్ లో 97 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునిత గోపాల్ దాస్ తెలిపారు. అన్ని డిపోలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగిందని తెలిపారు. డ్యూటీపై ఇతర రాష్ట్రాలకు వెళ్లిన డ్రైవర్, కండక్టర్ కు 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామని, 17న ఏ సంఘానికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు దాదాపు 10 ఏళ్ల తర్వాత జరుగుతుండటంతో యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సంస్థలో పనిచేస్తున్న 34,899మంది కార్మికులకు ఓటు హక్కు ఉండగా 98శాతం మంది ఓటు వేశారు. 12 కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ ప్రధాన సంఘాలుగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీడబ్ల్యూయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సీపీఐఅనుబంధ సంఘం ఈయూ నుంచి ఈదురు వెంకన్న, టీఎంయూ నుంచి థామస్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కార్మికుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 40 అంశాల సాధన లక్ష్యంగా ఈ కూటమి ప్రచారం సాగించింది. అయితే ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నువ్వా నేనా అన్నట్లు రెండు సంఘాల మధ్య కొనసాగింది. అయితే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) గెలుపు దిశగా దూసుకెళ్తున్నట్లు సమాచారం. అయితే తుది ఫలితం మాత్రం శనివారం రానుంది.
Also read: సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!