KTR on Power Cuts: విద్యుత్ వ్యవస్థ రాష్ట్రంలో వెంటిలేటర్ పై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సబ్ స్టేషన్ల వద్ద లాగ్ బుక్ లను ప్రభుత్వం దాచిపెడుతుందని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు విద్యుత్ జీవన రేఖ అన్నారు. 26 ఏళ్ల క్రితం కేసీఆర్ కరెంట్ ఛార్జీలపై ఉమ్మడి రాష్ట్రంలో తిరుగుబాటు చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 7,778 మెగావాట్లు విద్యుత్ ఉంటే 20,000 మెగావాట్ల స్థాయికి తీసుకువెళ్లామని, విద్యుత్ పై బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.
కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కరెంటు కోతలతో రాష్ట్రం అల్లాడిపోతుందన్నారు. రాబోయే రోజుల్లో తాగు నీరు ఇచ్చే పరిస్థితి లేదని, 1980లో కరెంటు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి రైతులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేశారన్నారు. విద్యుత్ కోతలకు ఎల్ నినో ప్రభావం అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారని.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో తోనే కరెంటు కోతలు అని దుయ్యబట్టారు.
నాణ్యత లేని బొగ్గు సరఫరా వలన రూ.2,900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగిందన్నారు. తెలంగాణ జెన్ కో ద్వారా రూ.52,000 కోట్లు సింగరేణికి ఇవ్వాలన్నారు. సింగరేణిలో నాణ్యత ఉన్న బొగ్గును ఏపీ, కర్ణాటక, ఎన్టీపీసీకి ఇస్తోందన్నారు. కాంగ్రెస్ పెద్ద నాయకుల కుటుంబాల దోపిడీ, అవినీతి, కమీషన్లతోనే ఇది జరుగుతోందన్నారు. వైటీపీఎస్ లో బొగ్గు లేక డీజిల్ తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారన్నారు. సింగరేణి సంస్థ డబ్బులతో మెస్సితో ఫుట్ బాల్ ఆడుతున్నారని దుయ్యబట్టారు.
Also Read: ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!
రాష్ట్రంలో రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వాలనే డిమాండ్ తో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో ఆరు బృందాలు పవర్ ప్లాంట్లను పరిశీలించడం జరుగుతుందని వెల్లడించారు. వైటీపీఎస్, కెటీపీఎస్, భద్రాద్రి, భూపాలపల్లి కేటీపీపీ, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్తారన్నారు. వైటీపీఎస్ ను ఎందుకు ప్ైవేటీకరణ చేయాలని చూస్తుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల వద్దకు పోతే ఎందుకు అడ్డుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read: ఆదిలాబాద్ రిమ్స్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్!