రంగంలోకి హెచ్‌ఆర్సీ
⦿ లగచర్ల ఇష్యూలోకి ఎన్‌హెచ్ఆర్సీ ఎంట్రీ
⦿ సుమోటోగా కేసు స్వీకరణ
⦿ సీఎస్, డీజీపీలకు కీలక ఆదేశాలు
⦿ పట్నం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
⦿ తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
⦿ పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన పట్నం భార్య
హైదరాబాద్, స్వేచ్ఛ: Lagacharla Case: సంచలనం రేపిన లగచర్ల ఘటనలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. తాజాగా ఈ వ్యవహారంలోకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంటర్ అయింది. లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు ఇష్యూ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్.
పట్నం పిటిషన్‌పై విచారణ
లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. కొడంగల్ కోర్టు విధించిన రిమాండ్‌ను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, బుధవారం పిటిషనర్ తరఫున వాదనలు విన్న కోర్టు, గురువారం ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు విన్నది. భూసేకరణకు వ్యతిరేకంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని పీపీ వాదించారు. ఈ మేరకు ఆ వీడియోలను సీడీ రూపంలో కోర్టుకు అందజేశారు.
నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి దిగారన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్కు వద్ద అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది మరోసారి గుర్తు చేశారు. ఈ మేరకు ఫోటోలను కోర్టుకు సమర్పించారు గండ్ర మోహన్ రావు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని వాదించారు. ఇటు, దాడి సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను కోర్టుకు సబ్మిట్ చేశారు పోలీసులు. దాడి జరిగిన ఫుటేజ్ మొత్తాన్ని కోర్టుకు సమర్పించారు. లీగల్ గానే అరెస్ట్ చేశామని కొన్ని డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేశారు. ఇరు వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
హైకోర్టులో పట్నం భార్య పిటిషన్
లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నరేందర్ రెడ్డి అరెస్ట్ జరిగిందని ఆయన భార్య శృతి పిటిషన్ ధాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో పేర్కొన్నారు శృతి. ప్రతివాదులుగా ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి, పలువురు పోలీసులను పేర్కొన్నారు. అయితే, పోలీసులు మాత్రం అరెస్ట్ సక్రమంగానే చేశామని చెబుతున్నారు.